
2022 మే నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా శ్రీలంక బ్యాటింగ్ స్టార్ ఏంజెలో మాథ్యూస్ ఎంపికయ్యాడు. అలాగే వుమెన్స్ క్రికెట్ పరంగా.. ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా పాకిస్థాన్ అరంగేట్రం స్పిన్ సంచలనం తుబా హసన్ ఎంపికైంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఓ ప్రకటనలో పేర్కొంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా.. బంగ్లాదేశ్‌పై శ్రీలంక జట్టు సిరీస్ గెలవడంతో ఏంజెలో మాథ్యూస్ కీలక పాత్ర పోషించాడు. రెండు టెస్టుల ఈ సిరీస్లో 172పరుగుల సగటుతో 344పరుగులు చేశాడు.
ఛటోగ్రామ్‌లో జరిగిన టెస్ట్ డ్రా కావడంలో మాథ్యూస్ కీలక రోల్ పోషించాడు. 199పరుగుల భారీ స్కోర్ చేసిన మాథ్యూస్ ఒక పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలాగే మిర్పూర్‌లో జరిగిన రెండో టెస్టులో 145పరుగులు చేశాడు. అతని అద్భుత ఇన్నింగ్స్ వల్ల శ్రీలంక జట్టు 506పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగలిగింది. ఇక ఈ టెస్టులో 10వికెట్ల తేడాతో శ్రీలంక విజయాన్ని అందుకుని సిరీస్ గెలుపొందింది. ఇక ICC WTC పాయింట్ల పట్టికలో ప్రస్తుతం శ్రీలంక 4వ స్థానంలో కొనసాగుతుంది.
2021 జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు ఇవ్వడం ప్రారంభమైంది. ఇక ఈ అవార్డుకు ఎంపికైన మొదటి శ్రీలంక ఆటగాడిగా మాథ్యూస్ నిలిచాడు. ఈ అవార్డు దక్కడం పట్ల మాథ్యూస్ స్పందిస్తూ.. 'నాకు ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుకు నామినీలుగా ఉన్న అసిత ఫెర్నాండో, ముష్ఫికర్ రహీమ్‌లను కూడా నేను అభినందిస్తున్నాను. ఈ అవార్డును నేను శ్రీలంక ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నాను. మనల్ని మనం నమ్మడాన్ని ఎప్పుడు ఆపొద్దు అని చెప్పాలనుకుంటున్నాను' అని మాథ్యూస్ పేర్కొన్నాడు.
ఇక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఓటింగ్ ప్యానెల్ సభ్యుడు, మాజీ దక్షిణాఫ్రికా ప్లేయర్ అయిన జేపీ డుమిని.. ఈ అవార్డు మాథ్యూస్‌కు దక్కడంపై మాట్లాడుతూ.. 'ఈ నెలలో ఏంజెలో మాథ్యూస్ ప్రదర్శన, అతను ఆటలో చూపుతున్న సంకల్పం చూస్తుంటే అతనిలో ఇంకా క్రికెట్ ఆట పట్ల ఎంత ఆకలి, ఏదైనా చేయాలనే తపన ఎంతుందో అర్థమవుతుంది' అని డుమిని పేర్కొన్నాడు. అతనికి అభినందనలు తెలిపాడు.