IPL 2022: లక్నో ఫ్రాంచైజీకి హెడ్ కోచ్ వచ్చేశాడు

ఐపీఎల్ 2022లో మరో రెండు కొత్త జట్లు దర్శనమివ్వనున్న సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన బిడ్లను, జట్ల కొనుగోలు కార్యక్రమాన్ని కూడా బీసీసీఐ ఎప్పుడో పూర్తి చేసింది. అహ్మదాబాద్ జట్టుని 5,625 కోట్ల రూపాయలకు సీవీసీ క్యాపిటల్ పాట్నర్స్ దక్కించుకోగా.. లక్నో జట్టుని 7,090 కోట్ల రూపాయలకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ చేజిక్కించుకుంది. దీంతో ఐపీఎల్ ఇకపై 10 జట్లతో జరగనుంది. ఇప్పటివరకు టోర్నీలో 8 జట్లే ఉండడంతో 60 మ్యాచ్‌లు జరిగేవి. అయితే రెండు కొత్త జట్లు కలిసి జట్ల సంఖ్య 10కి చేరడంతో ఇక నుంచి ఐపీఎల్‌లో ఈ సారి 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.

లక్నోకు హెడ్‌కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ హెడ్‌కోచ్
ఐపీఎల్ 2022 కు సమయం దగ్గర పడుతుండడంతో కొత్తగా వచ్చిన లక్నో ప్రాంచైజీ తమ జట్టుకు హెడ్‌కోచ్‌ను నియమించింది. ఆండీ ఫ్లవర్‌ను తమ హెడ్ కోచ్‌గా నియమించినట్టు లక్నో ప్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్ గతంలో అంతర్జాతీయ స్థాయిలో హెడ్ కోచ్‌గా పని చేశాడు. టాప్ జట్టు ఇంగ్లండ్‌కు హెడ్ కోచ్‌గా గతంలో విధులు నిర్వర్తించాడు.

కృతజ్ఞతలు చెప్పిన ఆండీ ఫ్లవర్
తనను హెడ్ కోచ్‌గా నియమించినందుకు లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఆండీ.. జట్టులో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు తెలిపాడు. ఇండియాలో క్రికెట్ పట్ల ఉండే ఆదరణ అసమానమైనదన్న ఆండీ.. ఈ అవకాశం రావడం తన అదృష్టం అని తెలిపాడు. అలాగే ఆండీ ఫ్లవర్‌కు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయెంకా ఆహ్వానం పలికారు. ఒక ఆటగాడిగా, హెడ్‌కోచ్‌గా క్రికెట్‌లో ఆండీ చెరగని ముద్ర వేశాడన్న ఆయన.. ఆండీ నైపుణ్యాన్ని గౌరవిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే తమ జట్టు స్థాయిని పెంచుతాడని గోయెంకా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎవరీ ఆండీ ఫ్లవర్?
ఆండీ ఫ్లవర్ జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. ఆ దేశ అత్యుత్తమ ఆటగాళ్లలో ఆండీ ఒకడు. జింబాబ్వే తరఫున 1992 నుంచి 2003 మధ్య 12 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడాడు. ఈ కాలంలో ఆండీ 63 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 51 సగటుతో 4,794 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక 232 పరుగులు చేశాడు. ఇక 213 వన్డేల్లో 35 సగటుతో 6,786 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అత్యధికంగా 145 పరుగులు చేశాడు. రిటైర్మెంట్ అనంతరం ఇంగ్లండ్‌కు దశాబ్ద కాలం పాటు హెడ్ కోచ్‌గా విధులు నిర్వర్తించాడు. ఇంగ్లండ్ జట్టు 2010లో టీ20 వరల్డ్‌కప్ గెలిచినప్పుడు, 2012-13లో భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలిచినప్పుడు ఆ జట్టు ప్రధాన కోచ్‌గా ఆండీ ఫ్లవరే ఉన్నాడు. అలాగే 2020-21 సీజన్‌లో ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా ఆండీ విధులు నిర్వర్తించాడు. కాగా లోకేష్ రాహుల్ కూడా లక్నో ఫ్రాంచైజీకే ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే లక్నో యాజమాన్యం, రాహుల్ మధ్య చర్చలు కూడా జరిగినట్టు సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications