ఇటీవల జరిగిన వన్డే వరల్ట్ కప్ నకు అర్హత సాధించలేదని కసినో, టీ20 ప్రపంచకప్ నకు అమెరికాతో సంయుక్తంగా తాము ఆతిథ్యం ఇస్తున్నామనే ఉత్సాహంతోనో తెలియదు కానీ.. వెస్టిండీస్ సెలక్టర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.టీ20 వరల్డ్ కప్ నకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తూ ఇంగ్లాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కు ఆండ్రూ రసెల్ ను ఎంపిక చేశారు. విండీస్ తరపున పొట్టి ఫార్మాట్ కు రసెల్ దాదాపు రెండేళ్లుగా దూరమయ్యాడు. 2021 ప్రపంచకప్ లో ఆఖరిగా టీ20 మ్యాచ్ ఆడాడు.
అలాగే దాదాపు నాలుగేళ్లు పాటు టీ20 ఫార్మాట్ కు దూరమైన షెర్ఫేన్ రూథర్ ఫోర్డ్ ను కూడా ఎంపికచేశారు. మరోవైపు ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో రాణించిన యువ ఆల్ రౌండర్ మాథ్యూ ఫోర్డేకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.

ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు వెస్టిండీస్ జట్టు:
పావెల్ (కెప్టెన్), షై హోప్ (వైస్ కెప్టెన్), ఛేజ్, మాథ్యూ ఫోర్డే, హెట్మెయిర్, జేసన్ హోల్డర్,అకీల్ హోసేన్,అల్జారీ జోసెఫ్,బ్రాండన్ కింగ్,కైల్ మేయర్స్,మొటియ్,నికోలస్ పూరన్,ఆండ్రూ రసెల్,రూథర్ ఫోర్డ్,షెఫార్డ్.
మరోవైపు ఇంగ్లాండ్ తో జరగుతున్న వన్డే సిరీస్ ను వెస్టిండీస్ 2-1 తేడాతో విజయం సాధించింది. శనివారం జరిగిన ఆఖరి వన్డేలో విండీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా మ్యాచ్ ను తొలుత 43 ఓవర్లకు కుదించారు. కానీ మళ్లీ వరుణుడి రాకతో 40 ఓవర్లకు తగ్గించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. డకెట్ (71), లివింగ్ స్టోన్ (45) రాణించారు. ఆఖర్లో రెహాన్ అహ్మద్ (15), అట్కిన్సన్ (20), పాట్స్ (15) కీలక పరుగులు చేశారు. మాథ్యూ ఫోర్డే, అల్జారి జోసెఫ్ చెరో మూడు వికెట్లు, షెఫార్డ్ రెండు వికెట్లు తీశారు.
అయితే మ్యాచ్ కు మరోసారి అంతరాయం కలగడంతో టార్గెట్ ను 34 ఓవర్లకు 188గా నిర్ణయించారు. వెస్టిండీస్ 31.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది.