ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టీ20లో ఆండ్రూ రసెల్ విధ్వంసం సృష్టించాడు. 29 బంతుల్లో 71 పరుగులు సాధించాడు. నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడికి తోడుగా రూథర్‌ఫర్డ్ (67; 40 బంతుల్లో) కూడా చెలరేగడంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 220 పరుగులు చేసింది.
బౌలర్లపై రసెల్ ఊచకోత సాధారణమే. కానీ వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో ఓ సంఘటన రసెల్‌కు కోపం తెప్పించింది. స్పెన్సర్ జాన్సన్ వేసిన రాకాసి బంతి రసెల్ ఎడమచేతికి బలంగా తాకింది. దాంతో క్రీజులోనే అతడు కిందపడిపోయాడు. అప్పుడే బ్యాటింగ్‌కు వచ్చిన రసెల్‌కు అది రెండో బంతి. తర్వాత రెండు బంతులన్ని డిఫెండ్ చేసిన రసెల్ అనంతరం విజృంభించాడు. జాన్సన్ బౌలింగ్‌లో వరుసగా సిక్సర్, బౌండరీ బాది ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ విధ్వంసాన్ని ఆఖరి ఓవర్ వరకు కొనసాగించాడు.

మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన వెస్టిండీస్ నామమాత్రపు ఆఖరి టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చార్లెస్ (4; 6 బంతుల్లో), నికోలస్ పూరన్ (1; 3 బంతుల్లో), మేయర్స్ (11; 7 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రోస్టన్ ఛేజ్ (37; 20 బంతుల్లో), కెప్టెన్ పావెల్ (21; 14 బంతుల్లో) దూకుడుగా ఆడుతూ రన్‌రేట్‌ను పెంచారు. కానీ ఎక్కవుసేపు క్రీజులో నిలవలేకపోయారు.
వారిద్దరు ఔటైన అనంతరం రూథర్‌ఫర్డ్‌తో కలిసి రసెల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆరో వికెట్‌కు 119 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రూథర్‌ఫర్డ్ సంయమనంతో ఆడుతూ అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లు బాదాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జేవియర్ రెండు వికెట్లు, బెహ్రెన్‌డాఫ్, స్పెన్సర్ జాన్సన్, హర్డీ, జంపా తలో వికెట్ తీశారు. రసెల్ దాడికి జంపా నాలుగు ఓవర్లలో 65 పరుగులు సమర్పించుకున్నాడు.