
హైదరాబాద్: వెస్టిండిస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ అరుదైన రికార్డుని నమోదు చేశాడు. కరేబీయన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా శుక్రవారం ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జమైకా తలవాస్ కెప్టెన్ ఆండ్రూ రస్సెల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తమ జట్టుని ఒంటి చేత్తో గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఆండ్రూ రస్సెల్ అనంతరం బ్యాటింగ్‌లో సెంచరీతో మెరుపులు మెరిపించాడు. దీంతో ఒకే మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో పాటు సెంచరీ సాధించిన రెండో టీ20 ప్లేయర్‌గా రస్సెల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జోయ్ డెన్లీ మాత్రమే ఈ ఘనతను అందుకున్నాడు.
డ్వేన్ బ్రావో కెప్టెన్‌గా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేయగా చివరి ఓవర్ తొలి మూడు బంతుల్లో మెకల్లమ్(56), బ్రావో(29), రామ్‌దిన్(0)లను పెవిలియన్‌కు చేర్చి ఆండ్రూ రస్సెల్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ క్రమంలో బ్రావో జట్టు 224 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా తలవాస్ జట్టు త్వరగా వికెట్లు కోల్పోయినా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి లూయిస్(51) సహకారంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు 13 సిక్సర్లతో 121 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.
దీంతో జమైకా తలవాస్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఇక, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో రస్సెల్‌దే వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఈ ఏడాది మేలో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.