హైదరాబాద్: డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌పై స్వతంత్ర యాంటీ డోపింగ్ ట్రిబ్యునల్ ఏడాది పాటు నిషేధం విధించింది. జనవరి 31 నుంచి అతనిపై సస్పెన్షన్ అమలు చేయనున్నట్లు మంగళవారం తీర్పు వెలువరించింది.
2015లో మూడు సార్లు రస్సెల్ డోపింగ్ టెస్టుకు హాజరు కాలేదు. ఆయా తేదీల్లో ఎక్కడ ఉన్నాడో తెలపాలంటూ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఆదేశించగా, ఆ వివరాలను ఇవ్వడంలో ఆండ్రీ రస్సెల్ విఫలమయ్యాడు. దీంతో అతనిపై జమైకా డోపింగ్ నిరోధక కమిషన్ చార్జ్ నమోదు చేసింది.

వాడా నిబంధనల ప్రకారం స్పందించకపోవడాన్ని డ్రగ్ పరీక్షలో విఫలమైనట్లుగానే భావించి, ఆ తర్వాత ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్ అతన్ని విచారించి ఏడాది పాటు నిషేధం విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా, రస్సెల్‌పై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తామని అతడి తరుపు లాయర్ అన్నాడు.
అయితే రస్సెల్‌పై విధించిన నిషేధం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై కూడా ప్రభావం చూపనుంది. ఎందుకంటే అతడు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ తరుపున ఆడుతున్నాడు. తాజా సస్పెన్షన్‌తో అతడు ఐపీఎల్ పదో సీజన్‌ని మిస్ అయ్యే అవకాశం ఉంది.
రస్సెల్ నిషేధంపై కోల్‌కతా నైట్ రైడర్స్ సీఈఓ మాట్లాడుతూ దీనిని పెద్ద నష్టంగా పేర్కొన్నాడు. వెస్టిండిస్ తరుపున ఆండ్రీ రస్సెల్ ఒక టెస్టు, 53 వన్డేలు, 43 టి20 మ్యాచ్‌లు ఆడాడు. గతేడాది ఐసీసీ వరల్డ్ టీ20 ఛాంపియన్‌గా అవతరించిన జట్టులో రస్సెల్ సభ్యుడిగా ఉన్నాడు.