
ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ (ఐడీసీఏ) నిర్వహించిన అండర్-19 టీ20 నేషనల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ టోర్నీ టైటిల్ విన్నర్‌గా ఆంధ్రప్రదేశ్ బధిరుల జట్టు నిలిచింది. ఈ టోర్నీ నిర్వహించిన తొలిసారే ఏపీ జట్టు విజయ పతాక ఎగరవేయడం విశేషం. ఇక ఐడీసీఏ బధిరుల కోసం తొలిసారిగా KFC U19 టీ20 నేషనల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌ను జూన్ 16 నుంచి జూన్ 19 మధ్య నిర్వహించింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల జట్లు పోటీ పడ్డాయి. ఇక ఫైనల్ చేరుకున్న ఆంధ్ర టీం.. ఫైనల్లో గుజరాత్ బధిరుల జట్టుతో తలపడింది.
తొలుత టాస్ గెలిచిన ఆంధ్రప్రదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఏపీ బౌలర్లు విశేషంగా రాణించారు. ఫలితంగా గుజరాత్ 97పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక అనంతరం బ్యాటింగ్లో బరిలోకి దిగిన ఏపీ జట్టు 5వికెట్లు కోల్పోయి 98పరుగుల టార్గెట్ అవలీలగా ఛేదించింది. దీంతో అండర్-19 టీ20 నేషనల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ టైటిల్‌ను ఏపీ జట్టు ముద్దాడింది.
ఇక ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన గుజరాత్ బ్యాటర్ ముస్తాకిమ్ కాజీ ఫైనల్లో 22 బంతుల్లో 26 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న టైంలో ఆంధ్రప్రదేశ్ డెఫ్ స్పిన్నర్ పి.ఉదయ్ కుమార్ అతన్ని ఔట్ చేసి గుజరాత్‌ను దెబ్బతీశాడు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన పి.విజయ భాస్కర్ తన 4ఓవర్లలో 3వికెట్లు తీయడంతో పాటు కేవలం 11పరుగులే ఇచ్చి రాణించాడు. అతను మ్యాన్ ఆఫ్ ద టోర్నీ టైటిల్‌ను కూడా గెలిచాడు. ఈ టోర్నీలో ఆద్యంతం జట్టు తరఫున అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
ఇక టైటిల్ ప్రజెంటేషన్ సందర్భంగా ఇండియన్ డీఫ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమిత్ జైన్ మాట్లాడుతూ.. ఇండియన్ డీఫ్ క్రికెట్ అసోసియేషన్, కెఎఫ్‌సీ కలిసి తొలిసారి నిర్వహించిన బధిరుల టీ20 క్రికెట్ టోర్నమెంట్ విజయవంతమైంది. తొలి టోర్నీలో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ జట్టుకు అభినందనలు. రానున్న రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లు తప్పకుండా నిర్వహిస్తాం' అని ఆయన పేర్కొన్నారు.