హెచ్‌సీఏ ఓటింగ్ షురూ: ఆరు పదవులకు 18 మంది పోటీ
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ హైకోర్టు ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించడంతో మంగళవారం 218 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.
మొత్తం ఆరు పదవులకు 18 మంది పోటీపడుతున్నారు. వివాదాలు.. విమర్శలు వచ్చిన నేపథ్యంలో హెచ్‌సీఏ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
హెచ్‌సీఏ అధ్యక్ష బరిలో జి.వివేకానంద్, విద్యుత్ జయసింహా పోటీ పడుతుండగా, కార్యదర్శిగా శేష్ నారాయణ్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మంగళవారం ఎన్నికల ప్రక్రియ ముగిసినా హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తొలుత టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్, వివేక్‌ల మధ్య పోటీ అనుకున్నారు. ఐతే అజహరుద్దీన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో వివేక్, విద్యుత్‌ల మధ్య పోటీ నెలకొంది. నిజానికి తొలుత అధ్యక్ష పదవి బరిలో ఉన్న విద్యుత్ నరసింహాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

పోటీ వివేక్, జయసింహా మధ్యే
అజహరుద్దీన్ నామినేషన్ తిరస్కరణకు గురైన తర్వాత విద్యుత్ జయసింహా ప్రధాన పోటీదారుగా ఉన్నాడు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు శివలాల్‌యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్.. విద్యుత్ నరసింహాకు మద్దతుగా నిలిచారు. విద్యుత్‌ను గెలిపించాలంటూ శివలాల్, అర్షద్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

వంకా ప్రతాప్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు
ఉపాధ్యక్షుడిగా డాక్టర్ అనిల్, కోశాధికారిగా మహేందర్‌లకు పెద్దగా పోటీ ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సంయుక్త కార్యదర్శి పదవికి పోటీ చేసిన తన నామినేషన్ తిరస్కరణపై హైకోర్టుకు వెళ్లిన వంకా ప్రతాప్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఒకటి కంటే ఎక్కువ పదవులకు నామినేషన్లు
ఒకటి కంటే ఎక్కువ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారన్న కారణంతో ప్రతాప్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రతాప్ సోమవారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు విచారణ జరిపి.. ప్రతాప్ సంయుక్త కార్యదర్శి పదవికి పోటీ చేసేందుకు అనుమతించాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు.

సంయుక్త కార్యదర్శి పదవికి అజ్మల్ అసద్, వంకా ప్రతాప్
దీంతో సంయుక్త కార్యదర్శి పదవికి అజ్మల్ అసద్, వంకా ప్రతాప్ పోటీలో ఉన్నారు. మంగళవారం జరుగుతున్న హెచ్‌సీఏ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలని మాజీ కోశాధికారి నరేశ్ శర్మ కోర్టును ఆశ్రయించగా... దీనిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ రిటర్నింగ్ అధికారిని కూడా హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు తుది తీర్పు తర్వాత ఎన్నికల ఫలితాలు వెల్లడి
దీంతో పాటు ఎన్నికల ఫలితాలను ప్రకటించొద్దని ఎన్నికల అధికారికి స్పష్టం చేశారు. మరోవైపు లోధా సిఫారసుల అమలుకు సంబంధించి మరింత స్పష్టత కోరుతూ హైదరాబాద్, తమిళనాడు, గోవా, మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications