అమరావతిలోని స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతోందని ఆ మధ్య ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై ఆయన మరోసారి మాట్లాడారు. దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని అమరావతిలో నిర్మించాలని నిర్ణయించిన్నట్లు వెల్లడించారు. స్పోర్ట్స్ సిటీలోనే నిర్మించాలని ప్రణాళిక రచించినట్లు పేర్కొన్నారు. ఈ భారీ స్టేడియం నిర్మాణం కోసం అరవై ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పిన ఆయన.. నిర్మాణం కోసం రూ.800 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు.
దేశంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం 1.10 లక్షల సిటింగ్ సామర్థ్యంతో అహ్మదాబాద్ లో ఉంది. ఇప్పుడు దానికి మించేలా 1.25 లక్షల సీటింగ్ కెపాసిటీతో నిర్మించాలని అనుకుంటున్నట్లు శివనాథ్ అన్నారు. ఈ స్టేడియం కోసం బీసీసీఐ నుంచి కొంత ఆర్థిక సాయం, స్థానికంగా మరి కొంత ఆర్థిక సాయం సమీకరిస్తామని చెప్పారు.

"రాష్ట్రంలో క్రికెట్ కోసం ప్రత్యేకంగా మూడు అకాడమీలు ఏర్పాటు చేయనున్నాం. విజయవాడ, ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఈ అకాడమీలు ఏర్పాటు చేసి, వాటి నిర్వహణ కోసం రాబిన్ సింగ్, మిథాలీ రాజ్‌లను ఎంపిక చేస్తాం. అమరావతిలో 2029 జాతీయ క్రీడలను నిర్వహించడానికి బిడ్‌లు వేస్తాం. వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎల్‌కు కనీసం 15 మంది ఎంపిక కావాలన్న లక్ష్యంతో పని చేస్తాం. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం విశాఖ స్టేడియాన్ని ఆధునీకరిస్తాం" అని శివనాథ్ పేర్కొన్నారు.