హైదరాబాద్: ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా తన నెంబర్ వన్ ర్యాంకుని కోల్పోయాడు. విండిస్-ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ అనంతరం ఐసీసీ ఆదివారం ప్రకటించిన ర్యాంకుల్లో రవీంద్ర జడేజా రెండో స్ధానంలో నిలిచాడు.
తన అద్భుతమైన బౌలింగ్‌తో విండీస్‌పై 2-1 తేడాతో సిరీస్ గెలిపించిన ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వెనక్కు నెట్టి అగ్రస్ధానాన్ని దక్కించుకున్నాడు. 896 పాయింట్లతో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. 884 పాయింట్లతో జడేజా రెండో స్థానంలో ఉన్నాడు.

ఆండర్సన్‌కి జడేజాకి 12 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. ఇక, టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు. విండిస్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆండర్సన్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన కెరీర్‌లోనే ఉత్తమ బౌలింగ్ (7/42) గణాంకాలను నమోదు చేశాడు.
దీంతో పాటు 500 వికెట్ల క్లబ్‌లో కూడా చేరాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు పడగొట్టిన ఆరో ఆటగాడిగా నిలవడంతో పాటు ఇంగ్లండ్ తరుపున ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఇంగ్లండ్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక, బ్యాట్స్‌మెన్ విభాగంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు.
జో రూట్(2), విలియమన్స్(3), పుజారా(4), డేవిడ్ వార్నర్(5) తర్వాతి స్థానాల్లో నిలిచారు. భారత ఆటగాళ్లు పుజారా, కోహ్లీలు నాలుగు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. కేఎల్ రాహుల్, రహానేలు ఒక్క స్ధానాన్ని మెరుగుపరచుకుని 9, 10 ర్యాంకుల్లో ఉన్నారు.
ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా, అశ్విన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా, టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా భారత్ తన స్ధానాన్ని నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికా(2), ఇంగ్లండ్(3), న్యూజిలాండ్(4), ఆస్ట్రేలియా(5), పాకిస్తాన్(6), శ్రీలంక(7) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
టాప్-5 టెస్టు బౌలర్ ర్యాంకులు:
James Anderson (England)
Ravindra Jadeja (India)
Ravi Ashwin (India)
Rangana Herath (Sri Lanka)
Josh Hazlewood (Australia)
టాప్-5 టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకులు:
Steve Smith (Australia)
Joe Root (England)
Kane Williamson (New Zealand)
Cheteshwar Pujara (India)
David Warner (Australia)
టాప్-8 టెస్టు జట్టు ర్యాంకులు:
India
South Africa
England
New Zealand
Australia
Pakistan
Sri Lanka
West Indies