ఐపీఎల్ 2026 సీజన్ సందడి ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వేదికగా జరగనున్న తొలి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఆర్సీబీ యాజమాన్యంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్సీబీ ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్, బ్లాక్ స్టోన్ కలిసి కొనుగోలు చేశాయి.
అనన్య బిర్లా జోష్..
ఆదిత్య బిర్లా గ్రూప్ ఇప్పుడు ఆర్సీబీలో వాటాను కలిగి ఉండటంతో కుమార మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా సోషల్ మీడియాలో తన జట్టును ఉత్సాహపరుస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. అనన్య బిర్లా తన జట్టును ఉత్సాహపరుస్తూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అనన్య బిర్లా సోదరుడు ఆర్యమన్ బిర్లా ప్రస్తుతం ఆర్సీబీ ఛైర్మన్‌గా ఉన్నారు. అనన్య ఆర్సీబీ జెండాను ఊపుతూ.. "ఈ సాలా కప్ నమ్దే.. లెట్స్ గో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ, అదే ఊపును ఈ ఏడాది కూడా కొనసాగించాలని అనన్య బిర్లా ఆకాంక్షించారు.

18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఛాంపియన్‌గా..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో ఆర్సీబీ ఒకటి. అయితే 2008లో ప్రారంభమైన ఈ లీగ్‌లో ఆర్సీబీ తొలిసారి 2025లో టైటిల్‌ను ముద్దాడింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో విజయం సాధించి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ప్రస్తుతం రజత్ పాటిదార్ సారథ్యంలో విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, ఫిల్ సాల్ట్ వంటి స్టార్ ప్లేయర్లతో ఆర్‌సీబీ పటిష్టంగా కనిపిస్తోంది.
సన్‌రైజర్స్‌తో పోరు అంత సులభం కాదు!
చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కోవడం ఆర్సీబీకి సవాలుతో కూడుకున్న పని. ఎందుకంటే 2024 సీజన్‌లో ఇదే మైదానంలో ఆర్సీబీపై హైదరాబాద్ ఏకంగా 287 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోని టాప్-4 భారీ స్కోర్లు హైదరాబాద్ పేరిటే ఉన్నాయి. విస్ఫోటక బ్యాటర్లతో నిండిన సన్‌రైజర్స్‌ను బెంగళూరు బౌలర్లు ఎలా అడ్డుకుంటారో చూడాలి.