
వీరూ క్రికెట్‌కే తొలి ప్రాధాన్యం ఇచ్చేవాడు:
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు కోచ్‌గా వ్యవహరించిన ఏఎన్ శర్మ సైతం విరాట్ కోహ్లీ చేసింది మంచిది కాదన్నారు. కోహ్లీ నిర్ణయాన్ని అస్సలు ఒప్పుకోనన్నారు. విరాట్ స్థానంలో సెహ్వాగ్ ఉంటే కచ్చితంగా క్రికెట్‌కే తొలి ప్రాధాన్యం ఇచ్చేవాడని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కీడా పేస్బుక్ లైవ్ పేజీ ఇంటరాక్షన్ సందర్భంగా శర్మ మాట్లాడుతూ... 'ఆట మీకు ప్రతిదీ ఇచ్చింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన తండ్రి మరణించిన రెండు రోజుల్లోనే ప్రపంచకప్ (1999) ఆడటానికి తిరిగి వచ్చాడు. విరాట్ కోహ్లీ స్థానంలో వీరూ ఉంటే కచ్చితంగా క్రికెట్‌కే తొలి ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఇది నేను రాసివ్వగలను' అని అన్నారు.

జట్టుతోనే ఉండి ఆస్ట్రేలియాతో పోరాడాల్సింది:
'నేను విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించను. ఈ సమయంలో కోహ్లీ జట్టుతోనే ఉండాల్సింది. జట్టుతో కలిసి అతడు పనిచేయాల్సింది. కెప్టెన్‌గా కొనసాగాల్సింది. విరాట్ తెలివైన కెప్టెన్ మరియు మంచి క్రికెటర్. జట్టుతోనే ఉండి ఆస్ట్రేలియాతో పోరాడాల్సింది. కోహ్లీ వంటి ఆటగాడు తిరిగి రావడం నాకు నచ్చలేదు. తీరికలేని క్రికెట్ ఆడుతున్నప్పుడు విరామం తీసుకోవచ్చు. కరోనా కారణంగా ప్రతిదీ ఆగిపోయింది. క్రికెట్ ప్రారంభమైంది. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత.. ఎవరైనా విరామం తీసుకుంటే ఎలా?' అని ఏఎన్ శర్మ ప్రశ్నించారు.

దిలీప్ దోషి సైతం:
భారత మాజీ స్పిన్నర్ దిలీప్ దోషి సైతం విరాట్ కోహ్లీపై మండిపడ్డారు. కోహ్లీ స్థానంలో తానుంటే కచ్చితంగా దేశం తరఫున ఆడేందుకే తొలి ప్రాధాన్యం ఇచ్చేవాడినని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆటగాళ్లను ఆపేందుకు బీసీసీఐకి ఎటువంటి అధికారాలు లేవని, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులను తాను అర్థం చేసుకుంటానన్నారు. అయితే వ్యక్తిగతంగా తాను మాత్రం జట్టుతోనే ఉండేవాడినని దోషి స్పష్టం చేశారు.

గవాస్కర్ ఫైర్:
టీమిండియా మేనేజ్మెంట్ ద్వంద్వ విధానాలను అవలంభిస్తున్నదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆరోపించారు. తండ్రి కానున్న కెప్టెన్ విరాట్ కోహ్లీకి పితృత్వ సెలవులు ఇచ్చి.. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన అంశాన్ని బుధవారం ఓ ఇంటర్వ్యూలో సన్నీ ప్రస్తావించారు. అదే యువ బౌలర్ టీ నటరాజన్ భార్య పాపకు జన్మనిచ్చినా.. నెట్ బౌలర్‌గా అతడు ఆస్ట్రేలియాలోనే ఉండాలని బీసీసీఐ చెప్పిందన్నారు. కోహ్లీకి ఓ న్యాయం.. నటరాజన్‌కు ఇంకో న్యాయమా అంటూ గవాస్కర్ టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్ అయ్యారు.