కోల్‌కత్తా: టెస్టు క్రికెట్‌లో నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న దక్షిణాఫ్రికాపై భారత్ 3-0 తేడాతో విజయం సాధించి ఫ్రీడమ్ ట్రోఫీని కైవసం చేసుకున్న సందర్భంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎంతో సంతోషించారు.
ఓ సినిమా షూటింగ్ నిమిత్తం కోల్‌కత్తాలో ఉన్న ఆయన హోటల్ రూంలోని టీవీలో మ్యాచ్ చూస్తూ ఢిల్లీలో జరిగిన నాల్గవ టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 337 పరుగుల తేడాతో విజయం సాధించగానే 3-0 తేడాతో మనోళ్లు గెలిచేశారంటూ ట్వీట్ చేశారు.

విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా ఎంతో అద్భుతంగా ఆడారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. వెల్ డన్ ఇండియా, వెల్ డన్ టీమ్, వెల్ డన్ విరాట్ అంటూ ప్రత్యేకంగా అందరినీ అభినందించారు.
ఇక పిచ్ విషయంలో విరాట్ నిర్ణయం చూసి తాను చాలా ఆనందపడ్డానని, ఇప్పుడు వాళ్లు పిచ్ గురించి ఏమంటారని ప్రశ్నించారు. ఎప్పుడూ ఇలాగే దృఢంగా, నిర్భయంగా ఉండాలని, తన అండదండలు ఎప్పుడూ ఉంటాయంటూ విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా ఆయన అభినందనలు తెలిపారు.
చెన్నై వరద బాధితులకు విరాళంగా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' నగదు: రహానే
ఫ్రీడమ్ సిరిస్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన నాల్గవ టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు సాధించిన రహానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

ఈ సందర్బంగా రహానే మాట్లాడుతూ.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనందుకు వచ్చిన డబ్బును చెన్నై వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. చెన్నై వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగిస్తోన్న భారత సైన్యానికి ధన్యావాదాలు తెలిపారు. తన గెలుపును చెన్నై వరద బాధితులకు, భారత సైన్యానికి అంకితమిస్తున్నట్టు ప్రకటించారు.