
హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా శుక్రవారం వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20లో 6 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో అజేయంగా 94 పరుగులతో నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
అమితాబ్ నటించిన 'అమర్ అక్బర్ ఆంథోని' సినిమాలోని డైలాగ్‌తో కోహ్లీని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో "విరాట్‌ను కవ్వించొద్దని ఎన్నో సార్లు చెప్పాను. కానీ వారు నా మాట వినలేదు. దీంతో కోహ్లీ చిట్టి రాసి వారి చేతిలో పెట్టాడు. చూడండి ఇప్పుడు.. వెస్టిండీస్ ప్లేయర్ల ముఖాలు ఎలా మాడిపోయాయో" అని ట్వీట్ చేశాడు.
అసలేం జరిగింది?
మ్యాచ్ 16వ ఓవర్‌లో ఓ అరుదైన సంఘటనతో వార్తల్లో నిలిచాడు. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు విజయానికి 30 బంతుల్లో 54 పరుగులు కావాలి. కోహ్లీ క్రీజులో ఉండటంతో మ్యాచ్ అప్పటికీ టీమిండియా చేతిలోనే ఉంది. విలియమ్స్ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లీ నేరుగా బౌండరీకి తరలించాడు.
ఆ తర్వాతి బంతిని లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌గా మలిచాడు. సిక్సర్ కొట్టిన తర్వాత కోహ్లీ అదే నోట్‌బుక్ స్టయిల్‌లో ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేశాడు. జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో కోహ్లీ నోట్‌బుక్ సెలబ్రేషన్‌పై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించాడు. ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో విరాట్ కోహ్లీని ఔట్ చేసినప్పుడు విలియమ్స్ జేబులోంచి బుక్ తీసినట్లు చూపిస్తూ టిక్కు కొట్టి కవ్వించాడు. దానిని దృష్టిలో ఉంచుకుని ఇలా చేసినట్లు మ్యాచ్ అనంతరం కోహ్లీ వెల్లడించాడు.