హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. అలాంటి కోహ్లీ కూడా ఓ బౌలర్‌ని ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడంట. అతనెవరో కాదు పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ అమీర్. ఇప్పటి వరకు తాను ఎదుర్కొన్న బౌలర్లలో అమీర్ బౌలింగ్ అత్యంత కఠినమైనదని కోహ్లీనే స్వయంగా చెప్పాడు.
దీపావళి పండుగను పరుస్కరించుకుని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హోస్ట్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముఖ్య అతిథిగా జీ టీవీ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆదివారం ప్రసారమైన ఈ ప్రత్యేక కార్యక్రమంలో అమీర్ ఖాన్... కోహ్లీని మీరు ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ ఎవరని ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు గాను కోహ్లీ తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్లు ఇద్దురు ముగ్గురున్నారని చెప్పిన కోహ్లీ, తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలింగ్ మాత్రం మహహ్మద్ అమీరేనని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అంతేకాదు అమీర్ ఓ గొప్ప బౌలర్ అని ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇటీవల ట్విట్టర్ వేదికగా అమీర్ అభిమానులతో ఇంటరాక్టివ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్స్‌లో ది బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరు? భారత్‌కు చెందిన ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు గాను అమీర్... విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్ మెన్‌గా అభివర్ణించాడు.
మోడ్రన్ డే బ్యాటింగ్ దిగ్గజాల్లో రోహిత్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ.. వీరిలో బెస్ట్ ఎవరిని అడిగితే అందరూ మంచి ఆటగాళ్లే కానీ తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం కోహ్లీ బెస్ట్ అని ఆమీర్ ట్వీట్ చేయడం విశేషం. మహ్మద్ ఆమీర్ గతంలో కూడా సందర్బం వచ్చినప్పుడల్లా కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకునే వాడు.
కోహ్లీ సైతం ఆమీర్ బౌలింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఘన విజయం సాధించడంలో అమీర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.