ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ముంబైకి ఈ సీజన్‌లో తొమ్మిదో ఓటమి. 13 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఎనిమిది పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.
అయితే వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా ఏడు వికెట్లకు 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (42; 21 బంతుల్లో, 6x4,2x6) టాప్ స్కోరర్. బుమ్రా (2/39), పీయూష్ చావ్లా (2/28) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది.

ఇషాన్ కిషన్ (40; 22 బంతుల్లో, 5x4, 2x6), తిలక్ వర్మ (32; 17 బంతుల్లో, 5x4, 1x6) పోరాడారు. వరుణ్ చక్రవర్తి (2/17), రసెల్ (2/34), హర్షిత్ రాణా (2/34) తలో రెండు వికెట్లు తీశారు. రోహిత్ శర్మ (19; 24 బంతుల్లో, 1x4, 1x6), సూర్యకుమార్ యాదవ్ (11; 14 బంతుల్లో, 1x4) స్లో ఇన్నింగ్స్ ఆడారు.
కాగా, సూర్యకుమార్ యాదవ్ ఔటైన తీరుపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు విశ్లేషించాడు. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన సూర్యను ప్రత్యర్థులు ఓ ప్రత్యేక ప్రణాళికతో బోల్తాకొట్టిస్తున్నారని పేర్కొన్నాడు. ఆ ఉచ్చులో పడకుండా సూర్య తెలివిగా బ్యాటింగ్ చేయాలని, దాని కోసం శ్రమించాలని సూచించాడు.
''సూర్యకుమార్ యాదవ్‌కు ప్రణాళికతో బౌలింగ్ చేస్తున్నారు. స్లో డెలివరీ లేదా వైడ్ దిశగా బంతులు సంధిస్తున్నారు. వరల్డ్ కప్‌లో కూడా సూర్యకు ఇలానే బౌలింగ్ చేస్తున్నారు. పిచ్ స్లోగా ఉండి, మైదానంలో ఓ వైపు బౌండరీ దూరంగా ఉన్న సందర్భాల్లో సూర్యకు ఈ ఉచ్చు బిగుస్తున్నారు. ఈ విషయంలో సూర్య కాస్త కష్టపడాలి'' అని రాయుడు పేర్కొన్నాడు. రసెల్ వైడ్ దిశగా వేసిన స్లో డెలివరీని సూర్య డీప్ స్క్వేర్ మీదగా షాట్‌కు యత్నించి ఫీల్డర్ చేతికి చిక్కాడు.