రాయుడు మనసులోని మాట! ఆ జట్టు తరఫున ఆడాలని ఉందట

తాను మరో మూడేళ్లు క్రికెట్ ఆడుతానని హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు ప్రకటించాడు. తనకు ఫామ్, ఫిట్ నెస్ ఉన్నంత వరకు క్రికెట్ ఆడుతానని చెప్పాడు. కాగా ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో అంబటి రాయుడు ఆంధ్ర జట్టు తరఫున ఆడాడు. త్వరలో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. రానున్న సీజన్‌లో రాణించడానికి ఇప్పటికే కసరత్తులు కూడా మొదలు పెట్టాడు. 2019లో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు సెలెక్ట్ కాకపోవడంతో మనస్తాపం చెందిన రాయుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు నెలల తర్వాత మళ్లీ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో చెన్నైసూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఈ మేరకు సీఎస్కే ప్రాంచైజీకి రాయుడు కృతజ్ఞతలు చెప్పాడు. 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు లభించినందుకు చాలా బాధగా అనిపించిందని అందుకే వీడ్కోలు ప్రకటించానని తెలిపాడు. అయితే ఆ తర్వాత ఐపీఎల్‌లో చెన్నైసూపర్ కింగ్స్ తరఫున ఆడాక తన బాధ పోయిందని రాయుడు చెప్పాడు. సీఎస్కే కెప్టెన్ ధోని తన కెరీర్‌పై ఎక్కువగా ప్రభావం చూపాడని, తనలోని ఉత్తమ ఆటగాడిని బయటికి తెచ్చాడని చెప్పుకొచ్చాడు.
రాబోయే ఐపీఎల్ సీజన్‌లో కూడా చెన్నైసూపర్ కింగ్స్ తరఫున ఆడాలని ఉందని రాయుడు ఈ సందర్భంగా తన మనసులోని కోరికను బయటపెట్టాడు. అయితే ఈ విషయమై తనకు చెన్నై యాజమాన్యం నుంచి ఎటువంటి సమాచారం లేదని చెప్పాడు. వేలంలో తనను చెన్నై టీం కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. జట్టులో ఏ స్థానంలో అయినా ఆడడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. కాగా సీఎస్కే రాయుడును రిటైన్ చేసుకోని సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఐపీఎల్‌లో తనకు 2021 ట్రోఫీ విజయం ప్రత్యేకమైనదని, ఆ విజయంలో తన వంతు పాత్ర పోషించినట్టు తెలిపాడు. ఈ ఏడాది పోటీ ఎక్కువగా ఉండడంతో వేలం ఆసక్తికరంగా ఉంటుందని అంచనా వేశాడు.
కాగా ఐపీఎల్‌లో 2010 నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన అంబటి రాయుడు.. 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. అయితే ఇటీవల రాయుడును చెన్నై యాజమాన్యం వేలానికి వదిలేసింది. కెరీర్‌లో 55 వన్డే మ్యాచ్‌లు ఆడిన అంబటి రాయుడు 47 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 124 పరుగులు చేశాడు. ఇక 6 టీ20 మ్యాచ్‌ల్లో 10 సగటుతో 42 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఐపీఎలో 175 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 29 సగటుతో 3,916 పరుగులు చేశాడు. అందులో 21 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అత్యధిక పరుగులు 100*.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications