
హైదరాబాద్: హైదరాబాద్ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్ (4/68), అంబటి రాయుడు (62) రాణించడంతో నాలుగు జట్ల వన్డే సిరీస్‌లో ఇండియా ఏ శుభారంభం చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఏ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఏపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత బౌలర్ల ధాటికి 31. 4 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఏ జట్టు కెప్టెన్ హెడ్ 28 పరుగులు, అగర్ 34 పరుగులతో నిలిచారు. ఆసీస్ జట్టులో అగర్‌దే అత్యధిక స్కోర్ కావడం విశేషం. మహ్మద్ సిరాజ్ 68 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
అనంతరం 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ 38.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 29 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కృనాల్ పాండ్యా, అంబటి రాయుడు కాపాడారు. కృనాల్ పాండ్యా(49), అంబటి రాయుడు (62) పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
మరో మ్యాచ్‌లో ఇండియా-బి 30 పరుగుల (డక్‌వర్త్ లూయిస్) ఆధిక్యంతో దక్షిణాఫ్రికా-ఎపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా-ఏ జట్టు 47.3 ఓవర్లలో 231 పరుగులు చేసి ఆలౌటైంది. ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీయగా, శ్రేయాస్ గోపాల్ 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆటకు వర్షం అంతరాయం కల్గించింది. మయాంక్ అగర్వాల్ 7 పరుగులు, దీపక్ హుడా 4 పరుగులు చేసి అవుట్ అవ్వగా కెప్టెన్ మనీశ్ పాండే 95 పరుగులు, శుభ్‌మన్ గిల్ 42 పరుగులు చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించారు.
కేదార్ జాదవ్ 23 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 24 పరుగులు చేశాడు. ఇండియా-బి 40.3 ఓవర్లలో 214 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయిన దశలో వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 30 పరుగుల తేడాతో ఇండియా-బి గెలిచినట్లు అంఫైర్లు ప్రకటించారు.