CSK: చెన్నైకి భారీ షాక్.. అంబటి రాయుడు దూరం!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అస్సలు కలిసిరావడం లేదు. ముందుగా ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లిన సురేష్ రైనా.. కుటుంబ కారణాలతో స్వదేశానికి వచ్చేశాడు. హర్భజన్ సింగ్ కూడా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఆపై చెన్నై బృందంలోని 13 మంది కరోనా బారిన పడ్డారు. అన్ని సమస్యలు అధిగమించి చెన్నై మొదటి మ్యాచ్ ఆడింది. అయితే ఆ మ్యాచులో స్టార్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడుకు తొడ కండరాలు పట్టేశాయి.

తొడ కండరాలు పట్టేయడంతో...
అంబటి రాయుడుకు తొడ కండరాలు పట్టేయడంతో మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సమాచారం. ప్రస్తుతం రాయుడు గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే ముందస్తు జాగ్రత్తగా మరో రెండు మ్యాచ్‌లకు విశ్రాంతిని ఇస్తారట. కండరాలు పట్టేయడంతో మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు ఆడలేదు. రాయుడు 100శాతం ఫిట్‌నెస్ సాధించలేదని రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు కెప్టెన్ ఎంఎస్ ధోనీ వెల్లడించాడు. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు (71: 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకం బాదిన విషయం తెలిసిందే.

రాయుడు విషయంలో చింతించాల్సిన పనిలేదు....
చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ... 'అంబటి రాయుడు విషయంలో చింతించాల్సిన పనిలేదు. అతనికి చిన్న గాయం అయింది. త్వరగానే కోలుకున్నాడు. రాయుడు మరో మ్యాచ్ ఆడకపోవడం కొంచెం ఇబ్బంది పెట్టే విషయమే' అని అన్నాడు. ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభమై వారం రోజుల గడవకముందే గాయాల బారిన పడుతున్న ఆటగాళ్ల సంఖ్య పెరుగుతున్నది. సన్‌రైజర్స్ కీలక ఆటగాడు కేన్ విలియమ్సన్‌కు కూడా కండరాలు పట్టేశాయి. బెంగళూరుతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ అతడు పాల్గొనలేదు. గాయం కారణంగా ఆ జట్టు ఆటగాడు మిచెల్ మార్ష్ ఏకంగా సీజన్ నుంచి వైదొలిగాడు.

తీవ్ర మనోవేదనకు లోనై...
2019 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం అంబటి రాయుడు వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆల్‌రౌండర్ (3డీ) అనే కారణంతో విజయ్ శంకర్‌కు జట్టులో స్థానం దక్కింది. ఆ తర్వాత విజయ్ శంకర్, శిఖర్ ధావన్ గాయాలతో దూరమైనా.. రాయుడికి జట్టులో చోటు దక్కలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన తెలుగు తేజం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే రాయుడుకి ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోకపోవడానికి అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాదే కారణమని వార్తలు వచ్చాయి. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో రాయుడు అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో ఎమ్మెస్కేను ఫాన్స్ టార్గెట్ చేశారు. 'ఎమ్మెస్కే ప్రసాద్.. 3డి గ్లాసులతో అంబటి రాయుడుని చూడండి' అని కామెంట్ల వర్షం కురిపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications