
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాటర్, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు అల్విదా పలికాడు. ఐపీఎల్ నుంచి కూడా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. ఇదే తనకు చిట్టచివరి ఐపీఎల్ సీజన్ అని, తనను ఆదరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని చెప్పాడు. తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశాడు. అక్కడే అసలు ట్విస్ట్ పెట్టాడు.

ఇదే తన చివరి ఐపీఎల్ టోర్నమెంట్ అని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానంటూ అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. 13 సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్‌తో అసోసియేట్ అయి ఉన్నానని, రెండు అత్యుత్తమ జట్ల తరఫున ఆడటం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని చెప్పాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నాడు. అదే సమయంలో అంబటి రాయుడు ట్విస్ట్ ఇచ్చాడు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు చేసిన ట్వీట్‌ను డిలేట్ చేశాడు.

ఈ వ్యవహారంపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తక్షణమే స్పందించింది. అతని రిటైర్మెంట్‌పై వివరణ ఇచ్చింది. అంబటి రాయుడు రిటైర్మెంట్ కావట్లేదని స్పష్టం చేసింది. రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ పోస్ట్ చేసిన ట్వీట్‌ను అతను డిలేట్ చేశాడని, దీనితో ఈ ఎపిసోడ్ ముగిసినట్టేనని వ్యాఖ్యానించింది. తమ ఫ్రాంఛైజీలోనే అంబటి రాయుడు కొనసాగుతాడని, ఇప్పట్లో రిటైర్మెంట్ కాబోడని చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశారు.
ఈ సీజన్‌లో తన పెర్ఫార్మెన్స్ పట్ల అంబటి రాయుడు సంతోషంగా లేడని, దాని వల్ల కొంత సైకలాజికల్ డిస్టర్బెన్స్‌కు గురై ఉంటాడని ఆయన వ్యాఖ్యానించారు. అంతే గానీ- రిటైర్మెంట్ ఆలోచన అతనికి లేదని, తమతోనే ఉంటాడనీ అన్నారు. ఏ ఆటగాడికైనా కొన్ని సందర్భాల్లో ఎత్తుపల్లాలు తప్పకపోవచ్చని, బహుశా అంబటి రాయుడు కూడా ప్రస్తుతం అదే స్థితిలో ఉన్నట్టు భావిస్తున్నామని చెప్పారు. అతనికి ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా అందిస్తామని వివరించారు.