Ambati Rayudu: తెలంగాణ అసెంబ్లీలో భారత్ రాష్ట్ర సమితికి చెందిన హుజూరాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి లేవనెత్తిన డిమాండ్ పట్ల మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అభ్యంతరం లేవనెత్తారు. ఆయన డిమాండ్ చేసినట్లుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఇంటి స్థలం అక్కర్లేదని తేల్చి చెప్పారు.
హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్, షూటర్ ఇషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు 600 చదరపు గజాల ఇంటిస్థలాన్ని కేటాయించడానికి తెలంగాణ మంత్రివర్గం ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపింది.

ఈ అంశాన్ని పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తారు. తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. వారితో పాటు తెలంగాణ, ఏపీకి చెందిన మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓఝా, అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు కూడా ఇంటి స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ జాబితాలో తన పేరును కూడా చేర్చడం పట్ల అంబటి రాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా అవసరమేనని, మహ్మద్ సిరాజ్ చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

తాను మాత్రం ఎప్పుడూ ఏ ప్రభుత్వం నుంచీ ఏదీ ఆశించలేదని అంబటి రాయుడు అన్నారు. తనకు ఇంటి స్థలం లేదా భూమిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వానికి పాడి కౌశిక్ రెడ్డి చేసిన అభ్యర్థనను గౌరవపూరకంగా తిరస్కరిస్తున్నానని స్పష్టం చేశారు. నిజంగా అలాంటి అవసరం ఉన్న క్రీడాకారులను ఆదుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.

దేశంలో అన్ని క్రీడలు, క్రీడాకారులకు క్రికెటర్లతో సమానంగా గౌరవం దక్కడం చాలా ముఖ్యమైన అంశమని అంబటి రాయుడు పేర్కొన్నారు. ఆయా స్పోర్ట్స్ ఈవెంట్స్‌లల్లో మెరుగ్గా ఉండటానికి వారి నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాల మద్దతు చాలా అవసరమని అన్నారు. ఈ విషయంలో క్రికెటర్లుగా తాము అదృష్టవంతులం అని, ఆర్థికంగా నిలదొక్కుకోగలమని చెప్పారు.