

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడి బౌలింగ్‌పై ఐసీసీ నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా అతడిపై నిషేధం విధించింది. ఇటీవల ఓ వన్డే మ్యాచ్‌లో రాయుడి బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తన బౌలింగ్ యాక్షన్ నిరూపించుకోవాలని ఐసీసీ 14 రోజుల గడువు కూడా ఇచ్చింది.
అయితే, నిర్ణీత 14 రోజుల్లో అంబటి రాయుడు హాజరు కాకపోవడంతో ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. "ఐసీసీ నిబంధనల్లోని 4.2 క్లాజ్ ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయకుండా అతనిపై నిషేధం విధించింది. బౌలింగ్ శైలిని పరీక్షించే వరకు నిషేధం అమల్లో ఉంటుంది" ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
భారత జట్టు తరుపున పార్ట్ టైమ్ బౌలర్‌గా అంబటి రాయుడు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. సిడ్నీలో జనవరి 13న ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అంబటి రాయుడి బౌలింగ్ శైలిపై మ్యాచ్ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాయుడు కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.
అయితే తన బౌలింగ్ శైలిని అంబటి రాయుడు సరిదిద్దుకుంటే బౌలింగ్‌కు ఐసీసీ మళ్లీ అనుమతిస్తుంది. మరోవైపు బీసీసీఐ నిబంధనల ప్రకారం దేశవాళీ క్రికెట్‌లో అతను బౌలింగ్ కొనసాగించే అవకాశం ఉంది.