
హైదరాబాద్: ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2018 సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసి, ఏడాదిన్నర తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు తేజం అంబటి రాయుడు యో యో ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమయ్యాడు.
శుక్రవారం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో యో-యో ఫిట్‌నెస్ టెస్టుకు హాజరైన అంబటి రాయుడు కేవలం 14 పాయింట్లు మాత్రమే సాధించాడు. నిర్దేశిత (16.1) ప్రమాణం అందుకోలేక పోవడంతో రాయుడు ఇంగ్లాండ్ పర్యటనకు జట్టులో స్థానం కోల్పోయే అవకాశం ఉంది.
ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. గతేడాది విఫలమైన సురేశ్ రైనా ఈసారి యో-యో ఫిట్‌నెట్ టెస్టులో విజయవంతమయ్యాడు. దీంతో రాయుడు స్థానం భర్తీపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన అంబటి 600పైన పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఐపీఎల్ సందర్భంగా మెడ గాయానికి గురైన కెప్టెన్ కోహ్లీ సహా, ధోని, భువనేశ్వర్, కేదార్ జాదవ్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు తేలింది. అయితే, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే జట్టులో కేదార్ జాదవ్‌కు చోటు దక్కలేదు. అయితే, కోహ్లీ గాయంపై స్పష్టత లేదు.
జూన్ 27, 29న ఐర్లాండ్‌తో రెండు టీ20లు మ్యాచ్‌ల్ని భారత్ ఆడనుండటంతో.. ఒకవేళ గాయం నుంచి కోహ్లీ పూర్తిగా కోలుకుని ఉంటే ఆ సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. ఆలా కాని పక్షంలో నేరుగా ఇంగ్లాండ్ పర్యటనలోనే తిరిగి కోహ్లీ మైదానంలోకి దిగనున్నాడు. జులై 3న ఇంగ్లాండ్‌తో మూడు టీ20, మూడు వన్డేలు, ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ప్రారంభం కానుంది.