హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అల్విరో పీటర్సన్‌పై రెండేళ్లు నిషేధం పడింది. 2014-15 సీజన్‌లో జరిగిన దేశవాళీ లీగ్ అయిన రామ్ స్లామ్ టీ20 ఛాలెంజ్ సిరిస్ కాంపిటేషన్‌లో పీటర్సన్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో క్రికెట్ దక్షిణాఫ్రికా అతడిపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
సుదీర్ఘ దర్యాప్తు ముగిసిన తర్వాత అతను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పినట్లు పేర్కొంటూ నిషేధం విధించింది. దీంతో 2015 నుంచి ఇప్పటివరకు మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిషేధానికి గురైన ఆరో క్రికెటర్‌గా పీటర్సన్ నిలిచాడు. కాగా, అల్విరో పీటర్సన్ దక్షిణాఫ్రికా తరపున 36 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.
గత రెండు సంవత్సరాలుగా అల్విరో పీటర్సన్ ఇంగ్లీషు కౌంటీల్లో లాంక్‌షైర్ జట్టు తరుపున ఆడాడు. కాగా, 2000వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రానే ఫిక్సింగ్‌కు కేసులో నిషేధం ఎదుర్కొన్న తర్వాత మరొక జాతీయ జట్టుకు ఆడిన దక్షిణాఫ్రికా క్రికెటర్‌పై నిషేధం పడటం ఇదే మొదటిసారి.

ప్రస్తుతం అల్విరో పీటర్సన్ వయసు 36 ఏళ్లు కావడంతో ఇక అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2015 రామ్ స్లామ్ టోర్నీలో అల్విరో పీటర్సన్‌తో పాటు పలువురు క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు.
ఈ ఫిక్సింగ్‌కు పాల్పడిన పలువురు క్రికెటర్లపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా పేర్కొంది. ఇదే దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది జనవరిలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ గులాం బోడీపై 20 ఏళ్ల పాటు నిషేధం విధించింది.
ఏదైతా శిక్షను క్రికెట్ దక్షిణాఫ్రికా విధించిందో దానిని పూర్తిగా స్వీకరిస్తున్నానని రెండేళ్ల పాటు నిషేధానికి గురైన అల్విరో పీటర్సన్ తెలిపాడు. తనకు ఇన్నాళ్లు ఎంతో మద్దతుగా నిలిచిన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు అల్విరో పీటర్సన్ క్షమాపణలు చెప్పాడు.