
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానెను బెంచ్‌కే పరిమితం చేయడం కఠినమైన నిర్ణయమని మాజీ పేసర్ అలన్ డొనాల్డ్ పేర్కొన్నాడు. టీమిండియా తుది జట్టులో అతడికి స్థానం లేకపోవడంతో ఆతిథ్య సఫారీ ఆటగాళ్లు ఎంతో సంతోషించి ఉంటారని అన్నారు. ఎందుకంటే భారత్ తరఫున ఇటీవలి కాలంలో విదేశాల్లో అత్యుత్తమంగా రాణించింది రహానె ఒక్కడే.
రహానె, కేఎల్ రాహుల్‌లను కాదని శిఖర్‌ధావన్, రోహిత్‌శర్మను తొలి టెస్టుకు ఎంపికచేయడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేయడంతోపాటు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో తదుపరి టెస్టు కోసం కోహ్లీసేన చేయాల్సిన మార్పులపై అలన్ కొన్ని విషయాలు సూచించారు.
'వాస్తవానికి రహానెను తొలి టెస్టుకు దూరంగా ఉంచడం కఠిన నిర్ణయమే. చివరిసారిగా ఇక్కడ పర్యటించినప్పుడు అతడు గొప్పగా రాణించాడు. నా దృష్టిలో, జట్టును స్థిరంగా నడిపించేవాళ్లలో రహానె ముందుంటాడు. అతను బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించ గల ఆటగాడు. రహానె బెంచ్‌కే పరిమితమై మైదానంలో తమ ఆటగాళ్ల కోసం డ్రింక్స్ తీసుకురావడం చూసి సఫారీ ఆటగాళ్లు ఆశ్చర్యపోయి ఉంటారు.' అని అభిప్రాయపడ్డాడు.
ఇంకా మాట్లాడుతూ, 'అతడు అంతర్జాతీయస్థాయి బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు శిఖర్‌ధావన్ కూడా దూకుడుగా ఆడే ఓపెనర్. ఒక వేళ అతన్ని దూరం పెట్టాలని టీమిండియా భావిస్తే ఆ నిర్ణయం తమకు లాభమేనని దక్షిణాఫ్రికా సంబరపడిపోతుంది. ఏకధాటిగా ఆడటంలో శిఖర్ నిఖార్సయిన ఓపెనర్ అతని అటాకింగ్ ఆటతో బౌలర్లు తమ లైన్ అండ్ లెంగ్త్‌లో వైవిధ్యం ప్రదర్శించాల్సి వస్తుందని దీంతో బౌలర్లకు చిక్కులు వచ్చి పడతాయని' విశ్లేషించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.