'ఖాళీ స్టేడియాల్లో టీ20 ప్రపంచకప్పా.. అలా ఊహించుకోవడం కూడా కష్టం'

మెల్‌బోర్న్: మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే ఒలింపిక్స్ సహా పలు ప్రతిష్టాత్మక టోర్నీలు వాయిదా, రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆట నిలిచిపోయింది. వైరస్ రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించవచ్చంటూ కొన్ని ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనలపై ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ విస్మయం వ్యక్తం చేశాడు.

అస్సలు ఊహించుకోలేకపోతున్నా:
అక్టోబర్‌లో సొంతగడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీని ప్రేక్షకులు లేకుండా ఊహించుకోవడం కష్టమని అలెన్ బోర్డర్ అభిప్రాయపడ్డాడు. ఖాళీ స్టేడియాల్లో నిర్వహించడం కంటే రద్దు చేయడం, లేదా వేరే చోట జరపడం ఉత్తమన్నాడు. 'ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్‌ను అస్సలు ఊహించుకోలేకపోతున్నా. అది నమ్మశక్యంగా అనిపించడం లేదు. జట్లు, సహాయ సిబ్బంది, ఆటకు సంబంధించిన మిగతా అధికారులు దేశమంతా తిరుగుతూ మ్యాచ్‌లు ఆడుతారు. కానీ అభిమానులకు మాత్రం అనుమతి ఉండదా' అని ప్రశ్నించారు.

ప్రేక్షకులు లేకుండా టోర్నీని నిర్వహించొద్దు:
'కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటే టోర్నీని మామూలుగా నిర్వహించండి. లేదంటే టోర్నీని రద్దు చేసి మరో చోట నిర్వహించండి. అంతే తప్ప ప్రేక్షకులు లేకుండా టోర్నీని నిర్వహించొద్దు' అని బోర్డర్ సూచించాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. అయితే ఆస్ట్రేలియాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో సెప్టెంబరు 30 వరకు ఆ దేశానికి విమాన ప్రయాణాల్ని నిషేధించారు. తర్వాత కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయలేని నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్‌ను నిర్వహించే యోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపైనే బోర్డర్ స్పందించాడు.

మ్యాక్స్‌వెల్ కూడా:
ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులే రానప్పుడు ప్రపంచకప్ జరుగుతోందని చెబితే.. ఎవరూ నమ్మరని, తనకు తెలిసి ఇది సాధ్యమయ్యే పని కాదని మ్యాక్సీ అన్నాడు. ఖాళీ స్టేడియాల్లో ప్రపంచక్‌పను నిర్వహించడం అసాధ్యం అని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు సుమారు 6,400 మంది కరోనా బారిన పడగా.. 61 మంది చనిపోయారు. ప్రతి రెండేండ్ల కోసారి జరిగే టీ20 ప్రపంచకప్ కోసం ఈసారి ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications