
అక్టోబర్-నవంబర్‌లో ఐపీఎల్?
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత మార్చి నెల నుండి అన్ని క్రీడలూ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్స్‌తో పాటు ఏప్రిల్ నెలలో భారత్‌లో నిర్వహించాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ సైతం వాయిదా పడింది. అయితే ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది. దీంతో అక్టోబర్-నవంబర్‌లో ఐపీఎల్ నిర్వహించే అవకాశాలున్నాయని ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై బోర్డర్ స్పందించారు.

ఐపీఎల్‌కు ఆటగాళ్లను అనుమతించొద్దు
తాజాగా అలన్ బోర్డర్ ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ... 'ప్రపంచకప్ నిర్వహించాల్సిన వేళ ఐపీఎల్ కొనసాగిస్తే ఒప్పుకోను. స్థానిక లీగ్ కన్నా ప్రపంచకప్‌కే ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ అలా జరగకపోతే ఐపీఎల్ కూడా జరగొద్దు. అక్టోబర్-నవంబర్ సీజన్‌లో ఐపీఎల్ ఆడించాలనే నిర్ణయం తీసుకుంటే నేను ప్రశ్నిస్తా. డబ్బు కోసమే ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. అది నిజం కాదా?. ఒకవేళ టీ20 ప్రపంచకప్‌కు బదులు ఐపీఎల్ నిర్వహించాలని చూస్తే.. ఇతర బోర్డులు తమ ఆటగాళ్లను అనుమతించొద్దు' అని బోర్డర్ అన్నారు.

టీ20 ప్రపంచకప్ వాయిదా
ఈ నెల 26 నుంచి 28 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. టీ20 ప్రపంచకప్ వాయిదా, ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేషన్లు, ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. టీ20 ప్రపంచకప్ వాయిదాపై ఆతిథ్య క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. ఖాళీ స్టేడియంలో టోర్నీని నిర్వహించడం ద్వారా బారీగా టికెట్ రెవెన్యూ నష్టపోతామని సీఏ భావిస్తోంది. ఇక ప్రపంచకప్ వాయిదా పడితే మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్నది ఐసీసీ, సీఏకు సవాల్‌గా మారింది.

పరస్పర అంగీకారం
టీ20 ప్రపంచకప్ టోర్నీని ఎప్పుడు నిర్వహించాలో అనేదానిపై ఐసీసీ మూడు రకాల ప్రత్యమ్యాయాలు చేస్తోంది. టోర్నీని వచ్చే ఫిబ్రవరి లో నిర్ణయించాలని ఐసీసీ భావిస్తోంది. ఇందుకు సీఏ కూడా సుముఖంగానే ఉంది. అయితే అదే సమయంలో భారత్-ఇంగ్లాడ్ సిరీస్ ఉండటంతో ప్రసారదారుల నుంచి అభ్యంతరం వ్యక్తమయ్యే అవకాశముంది. భారత్‌లో 2021 ప్రపంచకప్, ఆసీస్‌లో 2022 ప్రపంచకప్ ఆతిథ్యానికి పరస్పరం అంగీకరించుకోవడం మరో అవకాశం. ఇప్పటికే ఆసీస్ పర్యటనకు బీసీసీఐ సహకరిస్తున్న నేపథ్యంలో ఇదీ కుదరకపోవచ్చు. ఇక చివరగా 2022లో టోర్నీని నిర్వహించడం. ఆ ఏడాది ఒక్క ఐసీసీ టోర్నీ కూడా లేకపోవడం కలిసొచ్చే అంశమే. మొత్తానికి వీటన్నిటిపై ఐసీసీ చర్చల్లో ఏం తేలుతుందన్నది ఆసక్తికరం.


Click it and Unblock the Notifications
