
వచ్చే నెల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టు మ్యాచ్‌ల లైవ్ ప్రసారాలను DD స్పోర్ట్స్‌లో చూడొచ్చు. అన్ని కేబుల్, డీటీహెచ్ ప్లాట్‌ఫాంలలో ఈ మ్యాచ్ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇకపోతే అక్టోబరు - నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు పలు దేశాలతో టీ20 సిరీస్‌లు సన్నాహాకంగా ఆడబోతుంది. ఈ మేరకు ఆయా దేశాలతోని షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇకపోతే జులై 17వరకు టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంటుంది. అక్కడ పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు రీ షెడ్యూల్ చేసిన ఐదో టెస్ట్ మ్యాచ్ టీమిండియా ఆడుతుంది. ఇక ఆ తర్వాత టీమిండియా జూలై 22 నుంచి ఆగస్టు 7వరకు మూడు వన్డేలు, 5 టీ20ల పరిమిత ఓవర్ల సిరీస్‌లు వెస్టిండీస్‌తో ఆడేందుకు కరేబియన్ దీవులకు బయలుదేరుతుంది.
వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మధ్య జరిగే టీ20, వన్డే సిరీస్‌ల టెలికాస్ట్ వివరాల గురించి భారత సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ నుండి తాజా ప్రకటన వచ్చింది. 'జులై 2022లో వెస్టిండీస్‌లో భారత్ పర్యటనకు సంబంధించిన అన్ని క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ప్రత్యేకంగా డీడీ స్పోర్ట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అన్ని కేబుల్ మరియు DTH ప్లాట్‌ఫారమ్‌లలో వెస్టిండీస్ టూర్‌లోని అన్ని ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్ ప్రసారం చేస్తుంది. లైవ్ మ్యాచ్‌లు మాత్రమే కాకుండా.. డీడీ స్పోర్ట్స్ నిపుణులు, క్రికెట్ సెలబ్రిటీలతో ప్రీ-మ్యాచ్ మరియు పోస్ట్-మ్యాచ్ విశ్లేషణలతో కూడిన ప్రత్యేక షోలను కూడా డీడీ స్పోర్ట్స్ అందిస్తుంది' అని ప్రకటనలో పేర్కొంది.
వెస్టిండీస్ వర్సెస్ భారత్ మధ్య మూడు వన్డేలు ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జూలై 22, 24, 27తేదీలలో జరుగుతాయి. టీ20ల సిరీస్.. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జూలై 29న తొలి టీ20తో ప్రారంభమవుతుంది. రెండోది, మూడోది ఆగస్ట్ 1, 3తేదీలలో వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్‌లో జరుగుతాయి. ఆఖరి రెండు టీ20లు ఆగస్టు 6, 7తేదీలలో ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లోని బ్రోవార్డ్ కౌంటీ స్టేడియంలో జరుగుతాయి. ఆఖరి రెండు టీ20లు అమెరికాలో జరగనుండడం విశేషం.