వన్డే ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భిన్నమైన రికార్డులు సాధిస్తున్నాడు. కెప్టెన్సీ వహించిన సిరీస్‌ల్లో నయా చరిత్ర సృష్టిస్తున్నాడు. అప్పటివరకు క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డులను నమోదు చేస్తున్నాడు. ఈ రికార్డులన్నీ 2024 ఏడాది ప్రారంభంలోనే నమోదవ్వడం మరో విశేషం.
వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయాన్ని చవిచూసిన తర్వాత రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడు. ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికా టీ20, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు. కానీ సఫారీలతో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో రోహిత్ సమం చేశాడు.

అయితే జనవరి 3న కేప్‌టౌన్ వేదికగా ప్రారంభమైన భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టులో సరికొత్త రికార్డు నమోదైంది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన మ్యాచ్‌గా రికార్డులకెక్కెంది. కేవలం ఒకటిన్నర రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ ఫలితం 106.2 ఓవర్లలోనే తేలింది. అంతేగాక తొలి ఇన్నింగ్స్‌లో 153/4తో ఉన్న భారత్.. అదే స్కోరుకు ఆలౌటై చెత్త రికార్డు నమోదు చేసింది. టెస్టుల్లో ఒక్క పరుగు కూడా జత చేయకుండా ఆరు వికెట్లు కోల్పోయిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.
కాగా, సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యంత తక్కువ బంతుల్లో ఫలితం తెచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా భారత్-అఫ్గానిస్థాన్ మూడో టీ20లో మరో చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యంత ఎక్కువ బంతుల్లో ఫలితం తెచ్చిన కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. బెంగళూరు వేదికగా బుధవారం జరిగిన ఆఖరి టీ20లో అఫ్గాన్‌పై భారత్ రెండో సూపర్ ఓవర్‌తో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వైడ్లు, నోబాల్స్ మినహాయింపుతో ఈ మ్యాచ్ ఫలితం 261 బంతుల్లో తేలింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రిజల్ట్ కోసం అత్యంత ఎక్కువ బంతులతో తీసుకున్న మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిన కేప్ టౌన్ టెస్టు, బెంగళూరు టీ20 మ్యాచ్ రెండింట్లోనూ గెలిచిన జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలవడం విశేషం. ఇదే రికార్డుల వేటతో టీ20 ప్రపంచకప్ కూడా రోహిత్ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. దాదాపు 14 నెలల తర్వాత టీ20 ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ అఫ్గాన్‌పై ఆఖరి టీ20లో 69 బంతుల్లో అజేయంగా 121 రన్స్ చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్ శర్మ(5) రికార్డు సృష్టించాడు. కాగా, జూన్‌లో వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా టీ20 ప్రపంచకప్ నిర్వహించనుంది.