
ఐపీఎల్ మినీ వేలం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేరళలోని కోచి వేదికగా జరిగే ఈ వేలం కోసం బీసీసీఐ భారీగానే ఖర్చు చేస్తోంది. ఇక్కడి బోల్‌గటీ ఐలాండ్‌లోని గ్రాండ్ హయత్ హోటల్‌లో ఈ వేలం నిర్వహిస్తున్నారు. దీని కోసం ఈ హోటల్‌లో మొత్తం రెండు ఫ్లోర్లను పూర్తిగా బీసీసీఐ బుక్ చేసేసింది. ఈ వేలం ఏడు గంటలపాటు జరగనుంది. వేలానికి ముందు ఫ్రాంచైజీ యజమానులు అందరూ కూడా ఐపీఎల్ పాలక మండలిని కలిసి పలు అంశాలపై చర్చించారు.
ఏయే ఆటగాళ్లు ఐపీఎల్‌కు అందుబాటులో ఉన్నారు? ఎవరు చివరి నిమిషంలో దూరమయ్యారు? తదితర విషయాలను ఫ్రాంచైజీలు తెలుసుకున్నాయి. అనంతరం గురువారం నాడు బ్రాడ్‌కాస్ట్ భాగస్వాములంతా కలిసి మాక్ ఆక్షన్ నిర్వహించారు. ఇప్పటికే ఐపీఎల్‌లోని పది ఫ్రాంచైజీలు 163 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. దీంతో మిగిలి ఉన్న 87 స్థానాల కోసం వేలం జరుగుతోంది. వీటిల 30 స్థానాలు విదేశీ ప్లేయర్లకు చెందినవి. ప్రస్తుతం ఫ్రాంచైజీల వద్ద ఇంకా రూ.206.5 కోట్ల విలువైన నిధులు ఉన్నాయి.
రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే రూ.743.5 కోట్లు ఖర్చు చేశాయి. ఈ మినీ వేలంలో 991 మంది ఆటగాళ్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 405 మంది వరకు షార్ట్‌లిస్ట్ అయ్యారు. ఈసారి ఐపీఎల్ మినీ వేలాన్ని తొలిసారిగా రెండు వేరు వేరు సంస్థలు బ్రాడ్ కాస్టింగ్ చేస్తున్నాయి. ఐపీఎల్ వేలం మొత్తం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో బ్రాడ్ కాస్ట్ అవుతుంది. అదే సమయంలో లైవ్ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా కొనుగోలు చేసింది. దీంతో వేలం నిర్వహించే విధానంలో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్రాంచైజీ యజమానులు, సహాయక సిబ్బంది అందరూ ఇప్పటికే కోచి చేరుకున్నారు.