భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ వ్యవహారంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత రోహిత్ శర్మ టీ20ల నుంచి తప్పుకోవడంతో, బీసీసీఐ స్ప్లిట్ కెప్టెన్సీ (వేర్వేరు కెప్టెన్లు) విధానాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు రోహిత్ శర్మ, టెస్టులకు యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌లు సారథ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు కెప్టెన్ల విధానంపై మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ ఆసక్తికరమైన, సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్ప్లిట్ కెప్టెన్సీ ఇండియాకు సరికాదు
భారత క్రికెట్‌కు దీర్ఘకాలంలో స్ప్లిట్ కెప్టెన్సీ విధానం సరిపోదని దేవాంగ్ గాంధీ అభిప్రాయపడ్డారు.ఆల్-ఫార్మాట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయాలని ఆయన బలంగా వాదిస్తున్నారు. "స్ప్లిట్ కెప్టెన్సీ ఇతర దేశాల్లో పనిచేయవచ్చు, కానీ ఇండియాలో మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే మన జట్టుకు ఆలోచనా విధానంలో స్థిరత్వం అవసరం. అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న ఒక ఆటగాడు ఒక ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు, మిగిలిన ఫార్మాట్లకు కూడా అతనే నాయకత్వం వహించాలి" అని దేవాంగ్ గాంధీ అన్నారు.

కోహ్లీకి ఉన్నట్టుగానే గిల్‌కు
గిల్‌ను ఆల్-ఫార్మాట్ కెప్టెన్‌గా నియమించాలనే తన అభిప్రాయానికి దేవాంగ్ కొన్ని బలమైన కారణాలు చెప్పారు.2017లో విరాట్ కోహ్లీకి ఎలాంటి మద్దతు ఉండేదో, ఇప్పుడు గిల్‌కు కూడా అలాంటి సపోర్టు ఉందన్నారు.కోహ్లీ ఎలాగైతే ధోనీ సారథ్యంలో ఎదిగాడో, గిల్ కూడా కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాల మధ్య కెప్టెన్సీకి మెరుగులు దిద్దుకున్నాడని వెల్లడించారు.గిల్ అన్ని విభాగాల్లోనూ రాణించాడని గాంధీ ప్రశంసించారు.టెస్ట్ కెప్టెన్‌గా గిల్‌ను నియమించడం ద్వారా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముందుచూపుతో వ్యవహరించారని గాంధీ పేర్కొన్నారు. అయితే, 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌కు బదులుగా ఎవరు కెప్టెన్సీ తీసుకుంటారనే దానిపై బీసీసీఐ స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని గాంధీ సూచించారు.
గణాంకాలతో గిల్ వైపు
2000వ దశకం ప్రారంభం నుంచి భారత్ గెలిచిన ఐసీసీ ట్రోఫీలు అన్నీ కూడా ఆల్-ఫార్మాట్ కెప్టెన్ల హయాంలోనే వచ్చాయని గాంధీ గుర్తు చేశారు.గిల్ అన్ని ఫార్మాట్లలో సత్తా చాటాడు. ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, శుభ్‌మన్ గిల్‌ను భారత్‌కు భవిష్యత్ ఆల్-ఫార్మాట్ కెప్టెన్‌గా తీర్చిదిద్దడమే సరైన నిర్ణయం అని దేవాంగ్ గాంధీ స్పష్టం చేశారు.