
హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక జట్లు ఆడిన మ్యాచ్‌లకు సంబంధించిన పిచ్‌లను ఫిక్సర్లకు అనుగుణంగా తయారు చేశారని అల్‌జజీరా ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వెంటనే చర్యలు చేపడతామని చెప్పిన ఐసీసీ చర్యలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే.. స్ఫాట్ ఫిక్సింగ్, పిచ్ ఫిక్సింగ్ గురించి కథనాలు ప్రసారం చేసిన అల్ జజీరా వార్తా ఛానల్ ప్రతినిధులను త్వరలోనే కలుస్తామని ఐసీసీ తెలిపింది.
ఫిక్సింగ్ అంటూ వచ్చిన ఆరోపణలను దాచివుంచలేమని త్వరలోనే నిజనిజాలను త్వరలోనే వెల్లడిస్తామని ఐసీసీ వెలిబుచ్చింది. భారత్- శ్రీలంక (గాలె టెస్టు, జూలై 26-29, 2017), భారత్-ఆస్ట్రేలియా (రాంచీ, మార్చి 16-20, 2017), భారత్ - ఇంగ్లాండ్ (చెన్నై, డిసెంబరు 16-20, 2016) మ్యాచ్‌ల పిచ్‌లు మార్చారనే ఆరోపణపై విచారణ చేపట్టిన ఐసీసీ.. స్టింగ్ ఆపరేషన్ చేసిన వార్తా ఛానెల్ తమకు ఎడిట్ చేయని వీడియో ఫుటేజీ ఇవ్వడం లేదని తెలిపింది.
అయితే త్వరలోనే తాము అల్ జజీరా ప్రతినిధులను కలుస్తామని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ తెలిపారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు బయటపడాల్సి ఉందన్నారు. అంతర్జాతీయ క్రికెటర్లను కలిసే అవకాశాలు సంక్లిష్టం కావడంతో తక్కువ నిర్వాహక సామర్థ్యంతో జరుగుతున్న చిన్న చిన్న టీ20 లీగ్‌లను ఫిక్సర్లు లక్ష్యంగా ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే దేశవాళీల్లో భాగంగా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసే టీ20 లీగ్‌లకు కొన్ని కఠినమైన నిబంధనలు విధించే ఆలోచనలో ఉన్నామన్నారు.
'దూకుడుగా కొనసాగుతోన్న టీ 20 ఫార్మాట్ వల్ల ప్రస్తుతం బాగానే ఉండొచ్చు. కానీ, మున్ముందు ఇంకొన్ని సమస్యలు తలెత్తే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే దానికి ధీటుగా.. టెస్టు ఫార్మాట్‌లను పెంచే యోచనలో ఉన్నాం.' అని రిచర్డ్‌సన్ తెలిపాడు.