అలాంటి విషయాల్లో అస్సలు ఉపేక్షించబోం: బీసీసీఐ

హైదరాబాద్: అవినీతికి పాల్పడి క్రికెట్‌ను దెబ్బతీసే ఏ చర్యను ఉపేక్షించేది లేదంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ప్రకటించింది. ఓ టీవీ ఛానల్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై నిజ నిర్ధారణలకు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం, ఐసీసీ అవినీతి నిరోధక విభాగంతో కలిసి పనిచేస్తోందని పేర్కొంది. ఇప్పటికే ఈ అవినీతి ఆరోపణలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం కావడంతో బీసీసీఐ వేగంగా చర్యలు చేపట్టింది.

అవినీతిపై ఓ డాక్యుమెంటరీని రూపొందించి
గత రెండేళ్లలో కనీసం భారత్ ఆడిన మూడు టెస్టు మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయని అల్‌జజీరా న్యూస్ ఛానల్ సంచలన ఆరోపణలు చేసింది. క్రికెట్‌లో అవినీతిపై తమ పరిశోధనా విభాగంతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు దోహాకు చెందిన ఈ ఛానల్ పేర్కొంది. క్రికెట్‌లో అవినీతిపై ఓ డాక్యుమెంటరీని రూపొందించింది.

బుకీల ప్రభావం ఈ మ్యాచ్‌లపై ఉందని
గాలేలో 2017, జులై 26 నుంచి 29 వరకు జరిగిన భారత్-శ్రీలంక టెస్టు మ్యాచ్, రాంచీలో 2017, మార్చి 16-20 మధ్య జరిగిన భారత్-ఆస్ట్రేలియా టెస్టు, చెన్నైలో 2016, డిసెంబర్ 16-20 మధ్య జరిగిన భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ ఫిక్సింగ్‌కు గురయ్యాయని ఆ ఛానల్ పేర్కొంది. బుకీల ప్రభావం ఈ మ్యాచ్‌లపై ఉందని ఆరోపించింది. ఈ మూడు టెస్టుల్లో రెండింటిలో భారత్ గెలుపొందగా.. రాంచీ టెస్టు డ్రాగా ముగిసింది.

ఆసీస్ క్రికెటర్ల ప్రమేయం
రాంచీ టెస్టు ఫిక్సింగ్‌లో కనీసం ఇద్దరు ఆసీస్ క్రికెటర్ల ప్రమేయం ఉందని ఆ ఛానల్ తెలిపింది. చెన్నైలో జరిగిన టెస్టులో ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్ల ప్రమేయం ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని చెప్పింది. అయితే ఈ ఆరోపణలను ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఖండించగా.. ఇప్పుడిప్పుడే ట్యాంపరింగ్ వివాదం నుంచి కోలుకుంటున్న ఆసీస్ ఆటగాళ్లు ఇంకా స్పందించలేదు.

అటు ఐసీసీ కూడా స్పందించి
అల్‌జజీరా స్టింగ్ ఆపరేషన్‌పై అటు ఐసీసీ కూడా స్పందించింది. ఆ ఛానల్ చేసిన ఆరోపణలపై విచారణను ప్రారంభించినట్లు పేర్కొంది. ‘క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్' పేరిట అల్‌జజీరా ఈ డాక్యుమెంటరీని రూపొందించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications