న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని విమర్శించిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ హీలెకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కౌంటర్ ఇచ్చాడు. మీలో తప్పు పెట్టుకుని ఇతరులపై విమర్శలు చేయకూడదని అన్నాడు. అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే కోహ్లీతో పాటు అతని జట్టు పుంజుకుని సెకండ్ టెస్ట్ గెలిచిందని అన్నాడు.
కోహ్లీని విమర్శించడం వల్ల అతను మరింత దూకుడుగా ఆడతాడని, అది ఆసిస్‌కు ఏమాత్రం ఉపయోగపడదని అక్తర్ చెప్పాడు. ఆసిస్ జట్టు మాజీ వికెట్ కీపర్ అయిన ఇయాన్ హీలె అంతకుముందు - కోహ్లీపై గౌరవం పోతుందని, స్మిత్ పట్ల అతను వ్యవహరించిన తీరు సరికాదని అన్నాడు.

స్మిత్ వివాదంపై ఆసిస్ ఆటగాడు హ్యాండ్స్‌కాంబ్ స్పందించాడు. తన వల్లే అలా జరిగిందని చెప్పాడు. ఎల్బీడబ్ల్యూగా ఔటైన వెంటనే రివ్యూ కోరాల వద్దా అనే విషయంలో మరో ఎండ్‌లో ఉండే బ్యాట్స్‌మన్‌తో చర్చించవచ్చు. దీంతో స్మిత్ ఎదురుగా ఉన్న పీటర్ హ్యాండ్స్‌కాంబ్ వద్దకు వెళ్లి మాట్లాడాడు.
అక్కడ వరకూ బాగానే ఉన్నప్పటికీ తర్వాత స్మిత్ డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూస్తూ సైగలు చేశాడు. రివ్యూ కోరాలా వద్దా అనే విషయంలో సహాయం తీసుకునేందుకు ప్రయత్నించాడు. అదే వివాదానికి కారణమైంది. స్మిత్ తనను అడిగినప్పుడు తానే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడాల్సిందిగా చెప్పన్నట్టు తెలిపాడు. అయితే తనకు నిబంధనల గురించి సరైన అవగాహన లేదని ఆయన అన్నాడు.