గతంలో రవిశాస్త్రి ఏం చెప్పాడు.. ఇప్పడు ఏం చేశారు?! కుల్దీప్ నిరుత్సాహం చెంది ఉంటాడు!!

గబ్బా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా గడ్డపై మంచి రికార్డు ఉన్న కుల్దీప్‌ను కాదని.. అనుభవం లేని ఆటగాళ్లను ఎంపిక చేయడం అర్థం కాలేదని పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గాయపడడంతో.. మయాంక్ అగర్వాల్, శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

గతంలో శాస్త్రి ఏం చెప్పాడంటే:
2019 పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్‌ను.. ఆ సమయంలో టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. విదేశీ పర్యటనల్లో ఒక స్పిన్నర్‌ను తీసుకోవాల్సి వస్తే.. కుల్దీప్‌నే తీసుకుంటామన్నాడు. 'కుల్దీప్ విదేశీ టెస్ట్ క్రికెట్ బాగా ఆడాడు. సిడ్నీలో అతడు ఐదు వికెట్లు తీశాడు. కాబట్టి మా ప్రధాన విదేశీ స్పిన్నర్ అతడే' అని అన్నాడు. ఒక స్పిన్నర్‌తో ఆడాల్సివస్తే.. కుల్దీప్‌నే తీసుకుంటాం' అని రవిశాస్త్రి అన్నాడు. అందరికీ ఒక సమయం వస్తుందని, ఇప్పుడు కుల్దీప్ మా ఫ్రంట్‌లైన్ నంబర్ వన్ విదేశీ స్పిన్నర్ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

కుల్దీప్‌ను ఎందుకు తీసుకోలేదు:
అయితే ఈ ఆస్ట్రేలియా పర్యటనలో మాత్రం కుల్దీప్ యాదవ్ ఒక వన్డే, ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే అవకాశం ఇచ్చారని అజిత్ అగార్కర్ గుర్తుచేశాడు. ఇప్పుడు నాలుగో టెస్టులోనూ ఎంపిక చేయకపోవడంతో కుల్దీప్ నిరుత్సాహం చెంది ఉంటాడన్నాడు. గత ఆసీస్ పర్యటన తర్వాత అతడే నంబర్ వన్ స్పిన్నర్‌గా ఉన్నాడని, ఆ సిరీస్ తర్వాత మళ్లీ టెస్టులు ఆడలేదని అగార్కర్ అన్నాడు. జడేజా స్థానంలో సుందర్‌ను ఆల్‌రౌండర్‌గా తీసుకున్నా.. ఇంకో స్పిన్నర్‌గా కుల్దీప్‌ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు. అతడి చేరికతో బౌలింగ్ విభాగం మరింత సమతుల్యంగా ఉండేదని అగార్కర్ అభిప్రాయపడ్డాడు.

ఆశ్చర్యానికి గురిచేసింది:
కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్‌తో వైవిధ్యం ప్రదర్శిస్తాడని, గత పర్యటనలోనూ ఆస్ట్రేలియాలో అద్భుతంగా రాణించాడని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. కుల్దీప్‌ను ఈ మ్యాచ్‌లో ఎంపిక చేయకపోవడం తనని ఆశ్చర్యానికి గురిచేసిందని సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. మిచెల్ స్టార్క్ లాంటి క్విక్ బౌలర్ లేడని, సైనీ అదనపు పేస్‌తో ఆ దరిదాపుల్లో ఉన్నాడని అగార్కర్ అన్నాడు. కుల్దీప్ ఇప్పటివరకు 6 టెస్టులు, 61 వన్డేలు, 45 టీ20లు ఆడాడు. మొత్తగా 168 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications