
ఢిల్లీ: సౌరవ్ గంగూలీ తర్వాత.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సారథి విరాట్ కోహ్లీలు భారత జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చారు. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా మహీ నిలువగా, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలిపించిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఇరువురు జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించారు. కెప్టెన్సీ విషయంలో ఇద్దరి మధ్య కొంత తేడా ఉంటుంది. అయితే నాయకత్వం విషయంలో ధోనీ, కోహ్లీల మధ్య ఉన్న ఓ తేడాను టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ చెప్పాడు.
స్టార్ స్పోర్ట్స్ షో క్రికెట్ కనెక్టెడ్‌లో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ అతిగా స్పిన్నర్లపై ఆధారపడితే.. విరాట్ కోహ్లీ మాత్రం ఫాస్ట్ బౌలర్లపై ఎక్కువగా నమ్మకం ఉంచుతాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా రాణించడానికి కూడా కారణం అదే. జట్టును నడిపించడంలో ఇద్దరిదీ భిన్నమైన శైలి. కెప్టెన్లుగా ఇద్దరు ఎన్నో ఘనతలు సాధించారు. ప్రణాళికలు అనుసరించే విధానం వేరైనప్పటికీ తమ బౌలర్లపై కెప్టెన్లు నమ్మకం ఉంచితే ఉత్తమ ఫలితాలు రాబట్టుకోవచ్చు. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ విజయాలు సాధిస్తున్నాడు' అని తెలిపాడు.
1998లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్ అగార్కర్.. 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 2007లో అంతర్జాతీయ క్రికెట‌్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లో ఆశించిన మేర రాణించలేకపోయిన అజిత్ అగార్కర్.. వన్డేల్లో మాత్రం 5.07 సగటుతో 288 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లోనూ 42 మ్యాచ్‌లాడిన అగార్కర్ 29 వికెట్లు మాత్రమే తీశాడు.
దాదాపు 16 ఏళ్ళ పాటు భారత జట్టుకు ఎంఎస్ ధోనీ సేవలు అందించాడు. మూడు ఫార్మాట్లలో కూడా టీమిండియాకు ధోనీ అన్ని విధాలుగా తన బాధ్యతలు నిర్వహించి మంచి విజయాలు అందించాడు. 2007లో టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ (2011)తో పాటు 2013లో చాంపియన్ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు. మరోవైపు కోహ్లీ ఒక్క ట్రోఫీ గెలవకున్నా.. టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా నిలిచాడు.