ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ జట్టులో ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేష్ శర్మ వంటి వాళ్లకు చోటు దక్కలేదు. వీళ్లకు చోటు దక్కలేదని చాలా మంది ఫ్యాన్స్ కూడా నిరాశ పడ్డారు. అయితే ఈ సిరీస్‌లో తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ వంటి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు.
ఈ క్రమంలో రింకూ వంటి వారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదో ఒక బీసీసీఐ అధికారి తెలిపారు. అందరు కుర్రాళ్లకు ఒకే సిరీసులో అవకాశం ఇవ్వకుండా కొందరికే ఈ సిరీసులో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. రింకూ సింగ్ తదితరులను ఐర్లాండ్‌తో టీ20 సిరీసులో ఎంపిక చేస్తారని సమాచారం. ఐర్లాండ్ సిరీసులో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా అవకాశం దక్కుతుందని సమాచారం.

గైక్వాడ్ ఈ ఐపీఎల్‌లో 16 మ్యాచుల్లో 590 పరుగులతో రాణించాడు. రింకూ సింగ్ అయితే 14 మ్యాచుల్లో 474 పరుగులు చేశాడు. వీళ్లిద్దరికీ ఐర్లాండ్ సిరీసులో అవకాశం ఇవ్వాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భావిస్తోందట. 'రింకూనే కాదు, ఐపీఎల్‌లో రాణించిన మిగతా ప్లేయర్లను ఐర్లాండ్‌కు పంపాలని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. ఒకే సిరీసులో అందర్నీ ట్రై చేయకూడదని అనుకుంది' అని ఒక బీసీసీఐ అధికారి వెల్లడించారు.
'వన్డే టీంలో ఆడుతున్న ఏడుగురు ప్లేయర్లు టీ20 సిరీసులో ఆడటం లేదు. ఆ ఆటగాళ్లు అందరూ చాలా కీలకమైన వాళ్లే. వాళ్లంతా ఆగస్టులో ఆసియా కప్‌లో ఆడాల్సి ఉంది. కాబట్టి వీళ్లు చాలా ఇంపార్టెంట్' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారికి టీ20 జట్టులో చోటు దక్కని సంగతి తెలిసిందే. వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో కుర్రజట్టును ఎంపిక చేయాలని బీసీసీఐ అనుకుంటోందట.