WTC Final: పరిస్థితులు ఎలాగున్నా.. అత్యధిక పరుగులు, వికెట్లు తీసేది వారే! బుమ్రా ఉన్నా.. షమీనే నం.1!

ముంబై: టెస్ట్ ఫార్మాట్లో టీమిండియాకు మహ్మద్ షమీ నంబర్ వన్ బౌలరని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రా వేగంగా ఎదుగుతున్నా.. ప్రధాన పేసర్ మాత్రం షమీనే అని అన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా షమీ వికెట్లు తీయగలడని, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో అతడే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫైనల్‌లో ఎక్కువ పరుగులు చేస్తాడని జోస్యం చెప్పాడు. చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గెలుపొందేందుకు భారత్, న్యూజిలాండ్ జట్లు సర్వశక్తులూ ఒడ్డుతాయన్నాడు.

షమీనే నం.1:
తాజాగా అజిత్ అగార్కర్ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ... 'డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మహ్మద్ షమీ ఎక్కువ వికెట్లు తీస్తాడని నేను అనుకుంటున్నా. జస్ప్రీత్ బుమ్రా వేగంగా ఎదుగుతున్నాడన్నది నిజమే. కానీ నా వరకు షమీనే టీమిండియా నంబర్‌వన్ బౌలర్. టెస్టు క్రికెట్లో పరిస్థితులతో సంబంధం లేకుండా అతడు బౌలింగ్ చేస్తాడు. బంతితో స్వింగ్, సీమ్ రాబట్టగలడు. ఇంగ్లండ్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా షమీ వికెట్లు తీస్తాడు' అని అన్నాడు. ఛాంపియన్‌షిప్‌ను న్యూజిలాండ్ ఫేవరెట్‌గా ఆరంభిస్తోందని, ఏ జట్టు గెలుస్తుందో మాత్రం చెప్పలేనని అజిత్ అన్నాడు.

ఎక్కువ పరుగులు చేసేది కోహ్లీనే:
'డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఎక్కువ పరుగులు చేసేది మాత్రం విరాట్ కోహ్లీ అని నేను అనుకుంటున్నా. రెండోసారి ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు కఠిన పరిస్థితులు ఎదురైనా, ఇబ్బందులు వచ్చినా.. ఏం చేయగలడో అతడు మనకు చూపించాడు. జట్టు కోసం నిలబడతానని నిరూపించాడు. విరాట్ గతకొంత కాలంగా భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అతడు ఎప్పుడూ పరుగులు చేస్తూనే ఉంటాడు' అని అజిత్ అగార్కర్ చెప్పడు. జూన్ 18న సౌథాంప్టన్ వేదికగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మొదలవుతున్న సంగతి తెలిసిందే.

ఏ ఆటగాడైనా తనదైన ముద్రవేస్తే:
డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ ఉంటారని అజిత్ అగార్కర్ అంచనా వేశాడు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమయ్యే నాటికి మైదానం పచ్చికతో నిండి ఉంటే.. నాలుగో పేసర్‌ను కూడా తీసుకునే వీలుందన్నాడు. అప్పటికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదని, ముఖ్యంగా అక్కడి పిచ్‌లపై డ్యూక్‌బాల్స్ సీమర్లకే అనుకూలిస్తాయన్నాడు. అన్ని జట్లలాగే టీమిండియాలోనూ సమర్థవంతమైన పేసర్లున్నారని గుర్తుచేశాడు. గతకొన్నేళ్లుగా కోహ్లీసేన బలం వీళ్లేనని అజిత్ తెలిపాడు. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనేది గొప్ప విశేషమని, అందులో ఏ ఆటగాడైనా తనదైన ముద్రవేస్తే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారని చెప్పాడు. అలాంటివే ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయని అగార్కర్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications