Asia Cup 2025: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025కు కౌంట్ డౌన్ మొదలైంది. నెల రోజులు కూడా లేదు. సెప్టెంబర్ 9వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దీనికి వేదిక. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది.
ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే మ్యాచ్ ల తేదీలు, గ్రూపులు, వెన్యూలు ఖరారయ్యాయి కూడా.

ఈ టోర్నమెంట్ లో ఆడబోయే భారత జట్టును ఎంపిక చేయడానికి ఇంకో రెండురోజుల్లో బీసీసీఐ సెలెక్టర్లు సమావేశం కాబోతోన్నారు. నేడు ఈ సమావేశం జరుగనుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సారథ్యంలో సెలెక్షన్ కమిటీ భేటీ కానుంది. జట్టును ఎంపిక చేయనుంది. దీన్ని వెల్లడించడానికి బీసీసీఐ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసింది.
ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ ప్రెస్ మీట్ జరుగనుంది. అజిత్ అగార్కర్, కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. జట్టును ప్రకటించనున్నారు. జట్టు ఎంపికపై అందరి దృష్టీ నిలిచింది. టీ20 ఫార్మట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడే మెరికల్లాంటి ప్లేయర్లు అందుబాటులో ఉన్నందున.. ఎవరికి అవకాశం దక్కుతుందనేది చర్చనీయాంమౌతోంది.
గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరిగిన అండర్సన్- టెండుల్కర్ టెస్ట్ సిరీస్ నుంచి అర్ధాంతరంగా వైదొలగిన స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేడా? అనే అనుమానాలు నిన్నటి వరకూ వ్యక్తమౌతూ వచ్చాయి. అతని గాయంపై బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి పెద్దగా అప్ డేట్స్ ఏవీ లేకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఇప్పుడు తాజా వీటికి తెరపడింది. ఆసియా కప్ 2025 ఆడబోయే భారత జట్టు సెలెక్షన్ కోసం తాను అందుబాటులో ఉంటానని జస్ ప్రీత్ బుమ్రా స్వయంగా సెలెక్షన్ కమిటీకి సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు నిర్ధారించాయి. ఆసియా కప్ సెలెక్షన్ కు తాను అందుబాటులో ఉంటానని బుమ్రా తెలియజేశాడని పేర్కొన్నాయి.
ఈ మధ్యకాలంలో బుమ్రా టీ20లకు దూరం అయ్యాడు. అతను ఆడిన చివరి మ్యాచ్.. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 18 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత జరిగిన అన్ని టీ20ఐ సిరీస్‌ల నుండి అతనికి విశ్రాంతి ఇచ్చారు. ఈ ఫార్మాట్‌లో అతను 70 మ్యాచ్‌ల్లో 89 వికెట్లతో 17.74 సగటు, 6.28 ఎకానమీ రేట్ ను నమోదుచేశాడు.
ప్రాథమిక అంచనాల ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్ బ్యాటర్), తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా/ప్రసిద్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ/జురెల్ కు అవకాశం లభించవచ్చు.