Ajinkya Rahane: టీమిండియా స్టార్ క్రికెటర్ అజింక్యా రహానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముంబై క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతున్న అజింక్యా రహానే.. దేశీయ సీజన్‌కు ముందు ముంబై క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. అజింక్యా రహానే తన నిర్ణయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు."ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం, ఛాంపియన్‌షిప్‌లు గెలవడం నాకు ఎంతో గౌరవం. కొత్త దేశీయ సీజన్ ప్రారంభమవుతున్నందున, కొత్త నాయకుడిని ప్రోత్సహించడానికి ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. అందుకే కెప్టెన్సీ పాత్ర నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆటగాడిగా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ముంబైకి మరిన్ని ట్రోఫీలు గెలిచేందుకు నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్నాను" అని తెలిపారు.

నిజానికి అజింక్యా రహానే తన ప్రశాంతమైన కెప్టెన్సీతో జట్టును ముందుకు నడిపించారు. ఇటీవల రహానే ముంబై జట్టుకు నాయకత్వ వహించి 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలిపించాడు. ఆ టోర్నమెంట్‌లో రహానే 469 పరుగులు చేసి, ఆటగాడిగా తనలో ఇంకా చాలా ఉందని నిరూపించుకున్నాడు.కొత్త సీజన్‌కు జట్టు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కొత్త కెప్టెన్‌కు అవకాశాన్ని కల్పించనుంది. ఈ నిర్ణయంతో అజింక్యా రహానే జట్టును వీడతారన్న ఊహాగానాలకు ముగింపు పడింది. రహానే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆటగాడిగా కొనసాగే అవకాశం ఉంది.
రహానే కెరీర్‌లో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. 2020-21లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జట్టును గెలిపించి, ఒత్తిడిని అధిగమించగల తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. 2022 తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడినప్పటికీ.. 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో అద్భుతంగా పుంజుకున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్సీ కంటే ఆటపై దృష్టి పెట్టాలని అజింక్యా రహానే భావించి ఉండవచ్చు. రహానే ముంబై జట్టుకు, అలాగే భారత జట్టుకు చాలా ఏళ్లుగా కీలక ఆటగాడిగా ఉన్నారు. 37 ఏళ్ల ఈ ఆటగాడు భారత జట్టు తరపున అన్ని ఫార్మాట్లలో ఆడి 8414 పరుగులు చేశారు.