
హైదరాబాద్: భారత జట్టులో నాలుగో స్థానంలో ఎవరా అనే సందిగ్ధంతో జట్టు తర్జనభర్జన పడుతోంది. అయితే ఆ స్థానానికి అజింకా రహానె సరిపోతాడని భావించిన సెలక్టర్లు సురేశ్ రైనా పునరాగమనంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు. రైనాను ఐదో స్థానానికి పరిమితం చేసే యోచనలోనూ ఒకింత మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ ఆ స్థానానికి రహానెను తీసుకోదలిస్తే అతను పర్‌ఫెక్ట్ కావలసిందే.
భారత జట్టు గురించి ఈ మధ్యే స్పందించిన హర్ష బోగ్లే.. 'మిడిల్ ఆర్డర్‌కు కచ్చితంగా అజింకా రహానె సరిపోతాడని భావించి అతనిని నాలుగో స్థానానికి నిర్ధేశించాం. విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న రహానె మంచి స్ట్రైక్‌రేట్ 90తో మెరుగైతే అతను అంతర్జాతీయ జట్టులో సైతం పరిపక్వతతో రాణించగలడని భావిస్తున్నాను' అని తెలిపాడు.
మొన్నటి వరకు జరిగిన మ్యాచ్‌లలో ఓపెనర్లుగా దిగిన ధావన్, రోహిత్‌లు పెద్దగా రాణించకపోయినా వారి తర్వాత వచ్చిన కోహ్లీ జట్టును గెలిపించే విధంగా స్కోరు చేస్తున్నాడు. కానీ, జట్టుకు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎంతో కీలకం. ఆ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా వంటి హేమాహేమీలు ఇంతకుముందు వరకు బాగానే నిలదొక్కుకున్నారు.
జట్టులో యువక్రికెటర్లు రాణిస్తుండటంతో సీనియర్లకు చోటు లేకుండాపోయింది. దీంతో ఆ యువ క్రికెటర్లనే జట్టుకు సరిపోయే విధంగా మలుస్తున్నారు కోచ్‌లు. ఇక బౌలింగ్‌లోనూ అదే పరిపక్వత వచ్చేలా భారతి అరుణ్ భువనేశ్వర్, బుమ్రాలను తయారు చేస్తున్నాడు.