హైదరాబాద్: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. తొలిరోజైన గురువారం పుజారా, రహానేలు సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన అజింక్య రహానె భార్య రాధిక ధూపాకర్ తొందరపాటు సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తొలిరోజు ఆట ముగుస్తుందనుకునే సమయంలో రహానె 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో పెరీరా బౌలింగ్‌లో బంతిని డీప్ ఫైన్‌లెగ్ దిశగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఆ బంతి రహానే థైప్యాడ్‌ని తాకుతూ వికెట్ కీపర్ వెనక్కి వెళ్లిపోయింది. వెంటనే రహానె వేగంగా మూడు పరుగులు పూర్తి చేశాడు.

దీంతో రహానే సెంచరీ పూర్తి అయిందనుకున్న అతడి భార్య రాధిక చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టింది. అయితే ఆమె పక్కనే ఉన్న ఓ మహిళ అవి లెగ్‌బై రూపంలో వచ్చిన పరుగులని.. ఇంకా సెంచరీ పూర్తి కాలేదని చెప్పడంతో వెంటనే రాధిక నాలిక కరుచుకుంది.
ఆ తర్వాతి ఓవర్‌లోనే రహానే సెంచరీ పూర్తి చేయడంతో ఆమె ఆనందంతో మళ్లీ చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకుంది. టెస్టుల్లో రహానేకి ఇది 9వ సెంచరీ కావడం విశేషం. రహానే తన చివరి 17 ఇన్నింగ్స్‌లో కేవలం మూడు సార్లు మాత్రమే అర్ధ సెంచరీకిపైగా పరుగులు చేసాడు. గురువారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.