రెండో టెస్టు నుంచి రహానేను తప్పించడమా!: కుంబ్లే జవాబిదీ
బెంగుళూరు: వరుస టెస్టుల్లో విఫలమవుతున్న టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రహానేను తప్పించి అతడి స్ధానంలో ట్రిపుల్ సెంచరీ వీరుడు కరుణ్ నాయర్‌కు అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలకు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే తెరదించాడు. రహానేపై విశ్వాసం ఉంచిన కుంబ్లే అతడిని పక్కనబెట్టే ప్రశ్నే లేదన్నాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన సిరిస్‌లో పెద్దగా రాణించని రహానే చేతి గాయం కారణంగా మధ్య లోనే జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో 13, 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో రహానే ఆడిన గత ఐదు టెల్టుల్లో 204 పరుగులు మాత్రమే చేశాడు.

రహానేను తప్పించలేమన్న కుంబ్లే
గత ఐదారు మ్యాచుల్లో ప్రదర్శనను చూసి రహానేను తప్పించలేమని కుంబ్లే అన్నాడు. ‘రహానెను తప్పించే ప్రశ్నే లేదు. ఇంతకు ముందు అతడు చాలా పరుగులు చేశాడు. గత రెండు మూడేళ్లలో విజయవంతంగా ఆడాడు. జట్టు కూర్పు గురించి ఇంకా చర్చించలేదు. 16 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు' అని కుంబ్లే తెలిపాడు.

పూణె ఫలితం ఇప్పుడు గతం
పూణె ఫలితం ఇప్పుడు గతమని, జట్టు కోచ్‌గా తాను భవిష్యత్తుపైనే దృష్టి పెడతానని ఆయన అన్నారు. ‘మేం మా స్థాయికి తగినట్లుగా ఆడలేదు కాబట్టే ఓడిపోయాం. అలాంటి తప్పు ఇక్కడ జరగకుండా జాగ్రత్త పడతాం. జరిగినదాని గురించి చర్చ అనవసరం. సిరీస్‌లో మరో మూడు టెస్టులు ఉన్నాయి. ఆస్ట్రేలియా మెరుగైన జట్టే అనే విషయం మరచిపోవద్దు. ఈ టెస్టులో ఎలా విజయం సాధించాలనేదానిపైనే మా దృష్టి' అని కుంబ్లే అన్నాడు.

కరుణ్ నాయర్ ఇంకా కొన్నాళ్లు వేచి చూడాల్సిందే
ఇక కరుణ్ నాయర్ ఇంకా వేచి చూడాల్సిందేనని ఆయన అన్నారు. ‘ట్రిపుల్ సెంచరీ తర్వాత కూడా కరుణ్‌కు అవకాశం రాకపోవడం దురదృష్టకరం కానీ తప్పదు. తుది జట్టుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐదుగురు బౌలర్లను కొనసాగించాలా, లేదా నలుగురు బౌలర్లతో ఆడి మరో బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వాలా అనేది చెప్పలేను' అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.

బెంగళూరు పిచ్ ఫలితాన్నిస్తుంది
ఇక, బెంగళూరు పిచ్ ఫలితాన్నిచ్చేలా ఉంటుందని కుంబ్లే వెల్లడించాడు. ఇక నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్) వినియోగం గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందని కుంబ్లే చెప్పాడు. ‘డీఆర్‌ఎస్ గురించి ఎటువంటి గందరగోళం లేదు. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి కంటే మెరుగ్గా డీఆర్‌ఎస్‌ను వినియోగించాం. అవసరమనుకున్నప్పుడే రివ్యూ అడిగాం. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు' అని అన్నాడు.

ఆటగాళ్లు ట్రెక్కింగ్‌పై ఇలా
తొలి టెస్టులో అనూహ్య ఫలితం తర్వాత ఆటగాళ్లు ట్రెక్కింగ్‌కు వెళ్లినట్టు అనిల్ కుంబ్లే చెప్పాడు. ‘మనసును ఉల్లాసపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఓటమి తర్వాత క్రికెట్‌కు దూరంగా ట్రెక్కింగ్‌కు వెళ్లాం. గత 10 నెలలుగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాం. బ్రేక్ అనేది కావాలి' అని కుంబ్లే చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications