
హైదరాబాద్: భారత క్రికెటర్ అజ్యింకె రహానే తండ్రి మధుకర్ బాబూరావు రహానేను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్ధానిక మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్ధానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి చేర్పించి కోల్హాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రహానే తండ్రిని అదుపులోని తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. కుటుంబంతో కలిసి రహానే తండ్రి హుందై ఐ20 కారులో ప్రయాణిస్తున్నారు.
జాతీయ రహదారి నెంబర్.4కు సమీపంలోని కంగల్ ప్రాంతానికి వచ్చిన సమయంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి అసతాయి కాంబ్లి అనే మహిళపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న కోల్హాపూర్ పోలీసులు రహానే తండ్రిపై ఐపీసీ సెక్షన్ 304A, 337, 338, 279, 184 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, రహానే ప్రస్తుతం మూడో వన్డే కోసం విశాఖపట్నంలో ఉన్నాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం (డిసెంబర్ 17)న జరగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో 1-1తో సమంగా ఉన్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.