

హైదరాబాద్: అనుకోని కారణాల రీత్యా కెప్టెన్ స్థానంలో కోహ్లీకి బదులు రహానె వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ అనంతరం కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో బెంగళూరు వేదికగా జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండడు. దీంతో ఈ మ్యాచ్‌కు అజింక్య రహానే భారత కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. బెంగళూరు వేదికగా జూన్ 14న భారత్, అప్ఘానిస్థాన్ జట్ల మధ్య ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌తోనే తొలిసారి టెస్టు క్రికెట్లోకి అప్ఘాన్ జట్టు అడుగుపెట్టబోతోంది. సర్రే తరఫున కౌంటీల్లో ఆడేందుకు కోహ్లి ఇంగ్లాండ్ వెళ్తుండటంతో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ రహానే కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటాడనే వార్తలొస్తున్నాయి.
ఇంతకుముందొక సారి:
గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో రహానే తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. కోహ్లి భుజం గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో.. ధర్మశాలలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌కు రహానే నాయకత్వం వహించాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టెస్టులకు అతణ్ని పక్కనబెట్టారు. రహానే బదులు రోహిత్‌కు అవకాశం కల్పించారు.
కోహ్లీ అటు.. పూజారా, ఇషాంత్ ఇటు:
మూడో టెస్టులో జట్టులోకి వచ్చిన రహానే 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో తక్కువ స్కోర్లు నమోదైనా భారత్ 63 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం యార్క్‌షైర్ తరఫున కౌంటీల్లో ఆడుతున్న ఛటేశ్వర్ పుజారా అప్ఘాన్‌తో టెస్ట్ కోసం భారత్ తిరిగి రానున్నాడు. కౌంటీల్లో ఆడుతున్న ఇషాంత్ శర్మ కూడా ఈ టెస్టులో ఆడే ఛాన్స్ ఉంది.