రంజీలో ముంబయి కెప్టెన్ అజింక్య రహానె అదరగొట్టాడు. తాజాగా 200వ మ్యాచ్ ఆడుతోన్న అతడు మరో అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 12 ఫోర్ల సాయంతో 160 బంతుల్లో దీన్ని పూర్తి చేశాడు. దీంతో క్రికెట్ అభిమానులు అతడి ప్రదర్శన తీరుపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం హరియాణా - ముంబయి మధ్య రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లోనే రహానె అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో అతడికిది 200వ మ్యాచ్. అలానే ఇది 41వ సెంచరీ కావడం విశేషం. ఈ శతకం బాదిన తర్వాత అతడు ఇంకొంత సేపులో క్రీజులో ఉండి 108 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.

రహానె శతకం తోడవ్వడంతో.. తొలి ఇన్నింగ్స్ లో లభించిన 14 పరుగుల లీడ్ కలిపి హరియాణా ముందు 354 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది ముంబయి. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 339 పరుగులకు ఆలౌట్ అయింది. రహానె.. సూర్యకుమార్ యాదవ్‌తో (70) కలిసి నాలుగో వికెట్‌కు 129 పరుగులు, శివమ్ దూబేతో (48) కలిసి ఐదో వికెట్‌కు 85 పరుగులు నమోదు చేశాడు.
అంతకుముందు హరియాణా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ అంకిత్ కుమార్ (136) సెంచరీతో మెరిశాడు. ముంబయి తొలి ఇన్నింగ్స్ లో 315 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో రహానెతో పాటు చివర్లో వచ్చిన షమ్స్ ములానీ (91), తనుశ్ కోటియన్ (97) మంచిగా రాణించి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నారు.