
బ్రిస్బేన్: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కీలక రెండో వికెట్ కోల్పోయింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ బౌలింగ్‌లో గిల్ (91) ఔటయ్యాడు. 48వ ఓవర్ చివరి బంతికి స్లిప్‌లో స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 132 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు చేటేశ్వర్ పుజారాతో కలిసి గిల్ రెండో వికెట్‌కు 114 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. పటిష్ట ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ విజయం దిశగా సాగుతోంది. 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచి సవాల్ విసిరిన ఆసీస్‌కు అదే రీతిలో భారత బ్యాట్స్‌మెన్స్ సమాధానం చెబుతున్నారు. చివరి రోజు రహానే సేనకు దాదాపు 45 ఓవర్ల ఆట మిగిలి ఉంది. విజయానికి ఇంకా 166 పరుగులు చేస్తే చాలు. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ అజింక్య రహానే విజయంపైనే కన్నేశాడు.
నాలుగు పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది. ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్ శుభమన్ గిల్‌తో జతకట్టిన చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. యువ బ్యాట్స్‌మెన్ గిల్ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్ సెంచరీ సాధించి.. 91 పరుగుల వద్ద వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
శుభమన్ గిల్ అనంతరం అజింక్య రహానే క్రీజులోకి వచ్చాడు. రహానే వచ్చిన తర్వాతి ఓవర్‌లో హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పుజారా గాయపడ్డాడు. ఐతే అతనికి ఎలాంటి గాయం కాలేదు. దీంతో పుజారా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. రహానే వేగంగా ఆడుతూన్నాడు. మరోవైపు పూజారా కూడా వేగం పెంచాడు. భారత్ 55 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 156 రన్స్ చేసింది. విజయానికి ఇంకా 166 పరుగులు కావాలి. రహానే (16), పుజారా (34) క్రీజులో ఉన్నారు.