టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతను రిటైర్ అయ్యి మూడేళ్లు అవుతున్నా కూడా.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడైనా సరే ధోనీ గ్లింప్స్ దొరికితే చాలు ఫ్యాన్స్ తెగ సంతోషిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు టైటిల్ అందించిన ఈ 'కెప్టెన్ కూల్' ప్రస్తుతం తన ఆఫ్‌టైంను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే చెన్నైలో తమ బ్యానర్‌లో నిర్మించిన 'ఎల్‌జీఎం' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తాజాగా అతను ఒక విమానంలో కునుకు తీస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ధోనీ, అతని భార్య సాక్షి ఇద్దరూ విమానంలో ట్రావెల్ చేస్తున్నారు. ధోనీ తన సీట్లో కమ్మగా ఒక కునుకేస్తున్నాడు. ఇది చూసిన ఒక ఎయిర్ హోస్టెస్ తన ఎగ్జయిట్‌మెంట్ ఆపుకోలేకపోయింది. తన సీట్ నుంచి సెల్ఫీ వీడియో తీసుకుంది. అక్కడితో ఆగకుండా కెమెరా ఆన్ చేసి ఉంచి, తను ధోనీ వైపు నిలబడి వీడియో తీసింది.
వీడియోలో ధోనీ భార్య సాక్షి ఏదో మ్యాగజైన్ చదువుకుంటూ ఉంది. ఆమె తన కెమెరాలోకి రాకుండా ఎయిర్ హోస్టెస్ తన మొబైల్‌ను సెట్ చేసుకుంది. ధోనీని చూసినందుకు ఎంత ఎగ్జయిట్ అవుతుందో ఆమె మొఖం చూస్తేనే తెలిసిపోతోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ధోనీ ఫ్యాన్స్‌కు ఇది ఏమాత్రం నచ్చలేదు.
కనీసం ధోనీని ప్రశాంతంగా నిద్ర పోనివ్వరా? అని వాళ్లు నిలదీస్తున్నారు. తన ప్రైవసీకి ఈ ఎయిర్ హోస్టెస్ భంగం కలిగించిందని మండిపడుతున్నారు. అయితే ఇలా ఎయిర్ హోస్టెస్‌లు ధోనీపై తమ అభిమానాన్ని చాటుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా పలువురు ఇలా ధోనీని కలిసిన వీడియోలు నెట్టింట షేర్ చేసుకున్నారు.