సెంచూరియన్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 219 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (107 నాటౌట్; 56 బంతుల్లో, 8 ఫోర్లు, 7 సిక్సర్ల) సెంచరీతో కదంతొక్కాడు.
అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతంతో సత్తాచాటడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మహరాజ్, సిమెలన్ చెరో రెండు వికెట్లు, జేన్సన్ ఒక్క వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులకు పరిమితమైంది. లక్ష్యఛేదన ఆరంభంలో దక్షిణాఫ్రికా శుభారంభం దక్కలేదు. ఓ దశలో సఫారీలు పోటీలోనే లేరు.

కానీ జేన్సన్ (54 నాటౌట్; 17 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) అద్భుతంగా పోరాడారు. జట్టును గెలిపించేంత పనిచేశారు. కానీ మరో ఎండ్‌లో బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పిస్తున్నప్పటికీ అర్షదీప్ సింగ్ కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అంతిమంగా టీమిండియా విజయం సాధించింది. కాగా, మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను మార్క్‌రమ్ వివరించాడు.
చిన్నచిన్న తప్పులే తమ ఓటమికి కారణమయ్యాయని మార్క్‌రమ్ అన్నాడు. బౌండరీలకు అవకాశం లేకుండా బౌలింగ్ చేయడం, ఇక మంచి బంతుల్ని షాట్లకు యత్నించకుండా బ్యాటింగ్ చేయడం వంటి వాటిని అమలుచేయకపోవడం పరాజయాన్ని కారణమయ్యాయని తెలిపాడు. ''విజయానికి దగ్గరగా వచ్చినందుకు గర్వంగా ఉంది. మిడిలార్డర్-లోయర్ ఆర్డర్ గొప్పగా ఆడారు. సెంచూరియన్ వేదికలో స్వల్ప తేడాతో విజయాలు వస్తాయని మాకు తెలుసు''

''కొన్ని కీలక మూమెంట్స్‌లో సత్తాచాటి ఉంటే గెలిచేవాళ్లం. బౌండరీలకు ఛాన్స్ ఇవ్వకుండా బౌలింగ్, బ్యాటింగ్‌లో మంచి బంతుల్ని వదిలేయడం..వంటివి చేయాల్సింది. ఇక్కడ 220 పరుగుల ఛేదన కష్టతరమని అంటుంటారు. కానీ ఓవర్ ఓవర్‌కు అన్నట్లుగా, బంతి బంతికి అన్నట్లుగా ఆడితే గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఏ విభాగాల్లో మెరుగవ్వాలో చర్చించుకుంటాం'' అని మార్క్‌రమ్ పేర్కొన్నాడు. సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ జోహెన్నెస్‌బర్గ్ వేదికగా శుక్రవారం జరగనుంది. రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానుంది.