
బెంగళూరు: రెండో రోజు ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. శనివారం వేలాన్ని నిదానంగా ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం మాత్రం ఆరంభం నుంచే దూకుడుతో ప్రారంభించింది. రెండో రోజు వేలంలో తొలి ఆటగాడైన సౌతాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మాక్రమ్‌ను కొనుగోలు చేసింది. కోటి రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మాక్రమ్‌ను సన్‌రైజర్స్ పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో పోటీ పడి కొనుగోలు చేసింది. మొదటి నుంచి మాక్రమ్ కోసం పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. అయితే వేలం 2 కోట్ల రూపాయలు దాటిన తర్వాత ముంబై ఇండియన్స్ కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ చివరకు 2 కోట్ల 60 లక్షల రూపాయలకు ఐడెన్ మాక్రమ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కాగా మాక్రమ్ గతేడాది పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
తొలి రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో అనుసరించిన వ్యూహాలు, కొనుగోలు చేసిన ఆటగాళ్ల పట్ల అసంతృప్తితో ఉన్న అభిమానులు రెండో రోజు ఇందుకు భిన్నంగా ప్రయత్నించి మంచి ఫలితాలు రాబట్టాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో రోజు తొలి ఆటగాడిని, అది కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ రెండో రోజు ఇలాగే సరిగ్గా వ్యవహరించి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాలని ఆశిస్తున్నారు.
కాగా మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోనుగోలు చేసిన పదో ఆటగాడు ఐడెన్ మాక్రమ్. తొలి రోజు మొత్తం 9 మంది ఆటగాళ్లను సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. కాగా వేలంలో సన్‌రైజర్స్ ఇప్పటివరకు వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, శ్రేయస్ గోపాల్, సుచిత్, కార్తీక్ త్యాగిని కొనుగోలు చేసింది. రిటెన్షన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లను కలుపుకుంటే ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ దగ్గర 13 మంది ఆటగాళ్లు ఉన్నారు.